సిరా న్యూస్,హైదరాబాద్;
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హిండెన్ బర్గ్ రాసిన వార్తలపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు.
తన తమ్ముళ్లు దందాలు చేస్కోవచ్చు కాని సెబీ చైర్పర్సన్ ఆదాని సంస్థలో షేర్స్ కొనుక్కోవద్దా..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) షేర్స్ తీసుకోవడంపై అభ్యంతరం ఎందుకు..? హిండెన్ బర్గ్ సంస్థ రాసిన వార్తలపై సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పునిచ్చింది. హిండెన్ బర్గ్ ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి హిండెన్ బర్గ్ రాసిన వార్తల్లో వాస్తవికత లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పిందని గుర్తు చేసారు.
దేశంలో సెబీమీద, ఆదానీ మీద, సుప్రీంకోర్టు మీద, భారత ప్రజాస్వామ్యం మీద రాహుల్ గాంధీకి నమ్మకం లేదు. కాని, హిండెన్ బర్గ్ రాసే వార్తలను మాత్రం నమ్ముతారు. విదేశీ జర్నలిస్టులు రాసే వార్తలే నిజమంటూ రాహుల్ భావిస్తున్నారు.
ఎన్నికల్లో చావుదెబ్బ తిని అహంకారపూరితంగా దేశంలోని వ్యవస్థల మీద దాడిని రాహుల్ గాంధీ కొనసాగించాలనుకుంటున్నారు. మరి, బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు..? రాహుల్ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అదానీని రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించినట్టు..? గతంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని రాజీవ్ గాంధీ తనను కోరారని అదానీ చెప్పారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేలా ఢిల్లీకి ఆహ్వానించారు. హిండెన్ బర్గ్ ను అడ్డం పెట్టుకొని ఏం చేద్దామని అనుకుంటున్నారు. హిండెన్ బర్గ్ కు ఉన్న క్రెడిబిలిటీ ఏంటో రాహుల్ చెప్పాలి. దేశ ప్రజాస్వామ్యంపై దాడి చేయాలని కుట్ర చేస్తున్నవారికి కాంగ్రెస్ నాయకులు భజన చేస్తున్నారు. జార్జ్ సోరెస్ లాంటి వారు వ్యాపార సామ్రాజ్యంలో అడ్డగోలుగా సంపాదించేందుకునేందుకు తప్పుడు వార్తలు రాస్తే.. రాహుల్ గాంధీ లాంటి వారు ధర్నాలు చేస్తున్నారు. సెబీ హిండెన్ బర్గ్ కు నోటీసులు జారీ చేస్తే సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు..? రాహుల్ గాంధీ వంటి వారు సెబీని నమ్మరు, అదానీపై నమ్మకం లేదు. కాని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదానీతో కలిసి వ్యాపారాలు చేస్తారు. విదేశాల్లో అదానీతో కలిసి తిరుగుతూ, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. మళ్లీ భారత్ కు వచ్చిన తర్వాత అదానీపై ఆరోపణలు గుప్పిస్తారని అన్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు భారత షేర్ మార్కెట్ ను దెబ్బ తీయాలని అనుకుంటున్నారా.. భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారా..? హిండెన్ బర్గ్ సంస్థ, జార్జ్ సోరెస్ కలిసి చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడిని చెప్తూ వివరాలతో సహా కోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. రాహుల్ బ్రిటన్ లో కంపెనీని స్థాపించారని, ఆయన బ్రిటన్ పౌరుడని వివరాలు సమర్పించారు. దీంతో సిటిజన్ షిప్ తీసేస్తారేమోననే ఉద్దేశంతో రాహుల్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. షేర్స్ కొని, అమ్ముకునే బ్రోకర్ రాసిన వార్తతో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు గొడవలు సృష్టించాలనుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బ్లిట్జ్ పేపర్ పై సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రులతో లేఖలు రాయించగలరా..? అదానీ-హిండెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ గాంధీ ఇప్పటికైనా గౌరవించాలి. లేదంటే రానున్న రోజుల్లో జవాబుదారీగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాంమని అన్నారు.