సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హతా వేటు వేయడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది. తనపై అనర్హతా వేటు వేయడాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చేసింది. ఈ కారణంగా కోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు కూడా తక్కువేనని భావిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనందున కొనసాగే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికకు పదకొండో తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉంది. 28వ తేదీన పోలింగ్ జరుగుతుంది. విజయనగరం ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు కుటుంబసభ్యులు ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆయన చేరలేదు. అయితే టీడీపీ ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పిఆయనపై రాత్రికి రాత్రి అనర్హతా వేటు వేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ బాయ్ కాట్ చేసింది. దీంతో సహజంగానే వైసీపీకి పార్టీకి మెజార్టీ ఉంది. విశాఖలో ఉపఎన్నిక జరిగితే బొత్సకు బాధ్యత ఇచ్చారు. ఆయననే అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పుడు కూడా ఆయన కుటుంబానికే జగన్ టిక్కెట్ ఆఫర్ చేస్తారని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే పెడతారు. బొత్స కుటుంబంలోని అభ్యర్థి అయితేనే బలమైన అభ్యర్థిగా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. విజయనగరం స్థానిక సంస్థల్లో మొత్తం ఓటర్లు 753 మంది ఉన్నారు. వీరిలో వైసీపీకి 548 మంది, టీడీపీకి 156, జనసేనకు 13 మంది ఉన్నారు. స్వతంత్రులు 14 మంది ఉండగా ఇండిపెండెంట్లుగా గెలిచిన వారు 22 మంది ఉన్నారు. ఎలా చూసినా వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది టీడీపీలో చేరిపోయారు. బొత్స కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసే అంతా చూసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవిని మళ్లీ విజయసాయిరెడ్డికి ఇచ్చారు. ఆయన ఇంకా ఉపఎన్నికపై దృష్టి పెట్టలేదు. మరో వైపు బొత్స సత్యనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ ఉపఎన్నిక కోసం ఆయన తిరిగి వస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా అది బొత్స కు టుంబం నుంచే ఉంటుందని అంటున్నారు. ఇప్పటికీ వైసీపీ కూడా అభ్యర్థిపై ఎలాంటి కసరత్తులు చేయలేకపోయింది. విజయనగరం జిల్లా కాబట్టి బొత్స మాటే నెగ్గుతుంది. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ ఉంది. శాఖ స్థానిక సంస్థల విషయంలో టీడీపీ నేతలు మెజార్టీ ఓటర్లు ఉన్నారని భరోసా ఇవ్వలేకపోవడంతో బొత్సకు వాకోవర్ లభించింది. విజయనగరం జిల్లా నేతలు ఏం చేస్తారన్నదానిపై చర్చ నడుస్తోంది. ఒక వేళ పోటీ పెట్టాలనుకుంటే అనర్హతా వేటు పడిన ఇందుకూరి రఘురాజుకే టీడీపీ చాన్స ఇవ్వాలన్న సూచనలు ఉన్నాయి. గత ఎన్నికల తరవాత వైసీపీ క్యాడర్ టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. రఘురాజు వర్గం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయింది. వైసీపీ, టీడీపీ ఇద్దరూ పోటీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ జరుగుతుంది. ఎవరైనా వెనక్కి తగ్గితే మాత్రం.. ఏకగ్రీవం అవుతుంది.