రామోజీ సిటీలోకి బుల్డోజర్లు వెళ్తాయా

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్ళతో దున్నుతానని కేసీఆర్ శపథం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. పైగా మార్గదర్శి కేసులో జగన్ ఉరిమి వస్తుంటే.. రామోజీరావును జైలుకు వెళ్లకుండా కేసీఆర్ కాపాడారు..ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలోనూ నాగార్జున పై కేసీఆర్ ఇదే స్థాయిలో ఉదారత చూపారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదులో ఆక్రమణలను పడగొడుతోంది. చెరువులు, బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే పాలు చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను పడగొట్టింది. నిర్మాణంలో ఉన్న కట్టడాలను నేల కూల్చింది. భవిష్యత్తులోనూ చెరువులను, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. సాక్షాత్తు దీనిని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో హైడ్రా దూకుడును అడ్డుకునేవారు కనిపించడం లేదు. పైగా దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త విజ్ఞప్తులు హైడ్రా ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోని కబ్జాకు గురైన చెరువులు, నాయకులు నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాల వివరాలను హైడ్రా దృష్టికి పలువురు తీసుకొస్తున్నారు. ఇందులో ఎక్కువగా బడా బాబులకు చెందిన నిర్మాణాలే ఉన్నాయి. అయితే వాటిపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటున్ననేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన రామోజీ ఫిలిం సిటీపై తెరపైకి సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి.రామోజీ ఫిలిం సిటీపై ఆరోపణలు కొత్త కాదు. అసైన్డ్ భూములు ఆక్రమించి ఫిలిం సిటీని నిర్మించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొంతమంది పేదలకు ఆ భూములను పంపిణీ కూడా చేశారు. వీటిపై అప్పట్లో శంకర్రావు, గోనె ప్రకాష్ రావు వంటి వారు కోర్టులను ఆశ్రయించారు. రామోజీ ఫిలిం సిటీ విస్తరించిన ప్రాంతంలో చెరువులు ఉన్నాయట. రామోజీరావు నివసించిన భవనం పక్కనే అతిపెద్ద నాలా ఉందట. దానిని ఆక్రమించి భారీ నిర్మాణం చేపట్టారట. ఈ విషయాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఓ సామాజికవేత్త బయటపెట్టారు. తెలంగాణ హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే ఆ నిర్మాణాలను కూడా పడగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది. ఈ వీడియో ప్రసారమవుతుండగానే రామోజీ ఫిలిం సిటీ లో ఉన్న చెరువులను చూపిస్తుండడం విశేషం. మరి దీనిపై తెలంగాణ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు తెలంగాణ హైడ్రా చేస్తున్న పనులను ఈనాడు అభినందిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతోంది. మరి ఇదే స్ఫూర్తిని తన ఫిలిం సిటీ లోని చెరువులను పరిరక్షించేందుకు ప్రయోగించాలని కోరుతుందా? హైడ్రా తీసుకునే చర్యలకు సమ్మతం తెలుపుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *