సిరాన్యూస్, బేల
గ్రామ పంచాయతీకి మాజీ సర్పంచ్ నైతాం నానుబాయి భూ విరాళం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని భవానీగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నైతాం నానుబాయి సీతారాం ఏకోరి గ్రామ పంచాయతీ నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ఏకోరి గ్రామం ముందు టాక్లీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. గ్రామానికి చెందిన ఏ సమస్య అయినా గ్రామస్తులు టాక్లి గ్రామానికి వెళ్లి పరిష్కరించే వారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్న చిన్న తాండలను, గూడాలను అప్పటి ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
ఏకోరి గ్రామం నేడు గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కానీ నేటికీ స్వంత భవనం లేక పంచాయతీ కార్యదర్శి ఒక చిన్న అద్యే ఇంట్లో విధులను నిర్వర్తిస్తున్నారు. ఏకోరి గ్రామానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత సంవత్సరం పంచాయతీ నిర్మాణానికి నిధులు మంజూరు అయినా ప్రభుత్వ స్థలం లేక నిలిచిపోయింది. ఇది గమనించిన ఏకోరి మాజీ సర్పంచ్ నైతాం నానుబాయి సీతారామ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా గ్రామ పంచాయతీ లో తాము పడిన కష్టాలు ఇతరులు కూడా పడకూడదనే ఉద్దేశంతో గ్రామ అభివృద్ధికి తన స్వంత వ్యవసాయ భూమి నుండి గ్రామ పంచాయతీ నిర్మాణానికి కొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.దీంతో బుధవారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వారి వద్ద నుండి సంబంధిత పత్రాల పైన సంతకాలు చేసి మాజీ సర్పంచ్ ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యను మాజీ సర్పంచ్ దగ్గరుండి చూసారు కాబ్బటి గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయంగా కొంత స్థలాన్ని కేటాయించడం చాలా సంతోషంగా ఉంది వారికి గ్రామస్తుల తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.