సిరా న్యూస్,హైదరాబాద్;
కట్టుకున్న భర్తే కాల యముడిగా మారాడు. జీవితాంతం గుండెలపై పెట్టుకుని పెంచాల్సిన తండ్రే బిడ్డల గొంతు నులిమేశాడు. ప్రాణాలు పోసే వైద్యుడే కర్కోటకుడిగా మారి భార్య, ఇద్దరి పిల్లలను హతమార్చేశాడు. తన చేతులతోనే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆఖరికి శవ పరీక్ష నిర్వహించడంతో హత్య వ్యవహారం బయటపడింది.ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలో రెండు నెలలు కిందట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన వ్యవహారం మిస్టరీగా మారింది. ఈ మృతిపై అనేక అనుమానాలు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి శవ పరీక్ష నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని ఆమె భర్త బోడా ప్రవీణ్ కుమార్ హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు నిర్ధారించారు. 45 రోజులు తరువాత నిర్వహించిన శవ పరీక్షలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషం కలిపిన ఇంజెక్షన్ ఇచ్చి భార్యను సదరు వైద్యుడు హత్య చేశాడు. ఇదే విషయం పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది.
ఈ ఏడాది మే 28న బాబోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్, తన భార్య కుమారి (25), కుమార్తె కృషిక (4), తనిష్క(3)తో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. కారుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. అనంతరం రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీసి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో సిబ్బంది సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కుమారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనలో ప్రవీణ్‌కు స్వల్ప గాయాలు కావడంతో అతని బంధువుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముందు ప్రవీణ్ ను బంధువులే ఆటోలో మరో ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, వారి శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడం, ప్రవీణ్‌కు మాత్రం స్వల్ప గాయాలు కావడంతో కుమారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. భర్త ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడాని మృతిరాలి బంధువులు ఆరోపించారు. కుమారి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టరు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటన జరిగిన రోజు పోలీసులు కారును తనిఖీ చేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు ఖాళీ సిరంజి కారులో దొరికింది. ఆ సిరంజీని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించగా విషం కలిపిన ఇంజెక్షన్ ఇచ్చినట్టు తేలింది. దీంతో పోలీసులు అనుమానం మరింత రెట్టింపు అయింది. వెంటనే ప్రవీణ్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు తనిఖీ చేయగా అందులో కూడా కీలక ఆధారం పోలీసులకు లభ్యమైంది. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇస్తే ఎన్ని గంటల్లో చనిపోతారనే విషయాలను ప్రవీణ్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్టు తేలింది. పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.