సిరా న్యూస్, హైదరబాద్:
యూట్యూబర్‌గా రాణిస్తున్న కనగర్తి కుర్రాడు..
+ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంటూ యూట్యూబ్ వీడియోలు
+ పల్లెటూరు వీడియోలతో కొత్త సరికొత్త ట్రెండ్
యూట్యూబర్ కావాలనేది నేటి జనరేషన్ కల. సరికొత్త ఆలోచనలు, కంటెంట్‌తో ఇప్పటికే యూట్యూబర్‌గా చాలా మంది యువతీ, యువకులు రాణిస్తున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిలా కోనారావుపేట కనగర్తికి చెందిన కాసర్ల రాజిరెడ్డి–సత్తవ్వ దంపతుల కుమారుడు కాసర్ల పవన్ కుమార్ పక్కా పల్లెటూరు వీడియోలతో యూట్యూబర్‌గా దూసుకుపోతున్నాడు. తన స్వగ్రామమైన కనగర్తి పేరిట యూట్యూబ్ చానల్‌ను క్రియేట్ చేసి, గ్రామలో నిర్వహించే పండుగలు, పబ్బాలు, జాతరలు, పచ్చని పంటలు, నాటకాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో ఉంచుతూ ప్రజాధారణ పొందుతున్నాడు. యూట్యూబ్ వీడియోలకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తుండటంతో మరింత ఉత్సాహంతో పల్లెటూరుకి సంబంధించిన కొత్త కొత్త వీడియోలు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూనే మరో వైపు కన్న ఊరిపై మక్కువతో తన ఊరి విశిష్టతను ప్రపంచానికి చాటాలనే గొప్ప సంకల్పంతో యూట్యూబర్‌గా మారినట్లు పవన్ కుమార్ తెలిపారు. కాగా ఇలా క్రియేటివ్‌గా దూసుకుపోతున్న పవన్‌ను పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పల్లెటూరు వీడియోలు అందించాలని కోరుకుంటున్నారు.