సౌత్ లో యూత్ పాలిటిక్స్….

సిరా న్యూస్;

దక్షిణాది రాజకీయాలు దేశంలోనే ప్రత్యేకం. ఎందుకంటే జాతీయ పార్టీలకు ఇక్కడ ప్రాధాన్యం ఉండదు. అన్ని చోట్లా ప్రాంతీయ పార్టీలే కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీల నాయకత్వం సహజంగానే కుటుంబాల చేతుల్లో ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు ఆ కుటుంబం నుంచే వారసులుగా వస్తూంటారు. ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వారసులు ఉదయించడం కాస్త ఎక్కువగా ఉండనుంది. సీనియర్ నేతలంతా రిటైర్మెంట్ వయసు దగ్గర పడటంతో వారసుల్ని యువనేతల్ని ప్రోత్సహించబోతున్నారు. తెలంగాణలో రాజకీయాలు ఇప్పటికే స్పష్టమైన మార్పులు వస్తున్నాయి. రాజకీయాల్లో సూపర్ సీనియర్ అయిన కేసీఆర్ ఇక తెర వెనుకనే ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. మరో నాలుగేళ్ల తర్వాత వచ్చే జమిలీ ఎన్నికల నాటికి ఆయన నేరుగా ఫీల్డ్ లోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉండవచ్చు. మొత్తం బాధ్యత కేటీఆర్, కవితలకే అప్పగించవచ్చు. అందుకే ఇప్పటికే వారికి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం ఇస్తున్నారు. తను సలహాలకే పరిమితమవుతున్నారు. ముందు ముంద కొన్ని సార్లు ప్రజల ముందుకు వచ్చినా కీలక పాత్ర కేటీఆర్‌దే అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోనూ రేవంత్ హవా కొససాగనుంది. బీజేపీలో బండి సంజయ్ వంటి వారే కీలక పాత్ర పోషిస్తారు. అంటే సంప్రదాయ సీనియర్ నేతలు తెర వెనక్కి వెళ్లిపోయినట్లే.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. అప్పట్నుంచి ఆయనకు పోటీగా చాలా మంది వచ్చారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రత్యర్థులు వస్తూనే ఉన్నారు. మరో వైపు చంద్రబాబు మాత్రమే ఉంటున్నారు. తాను మొదటి సారి సీఎం అయినప్పుడు జగన్ నిక్కర్లేసుకుని ఆడుకుంటూ ఉంటారని చంద్రబాబు సెటైర్లు వేస్తూంటారు. చంద్రబాబు రాజకీయాల్లో మాస్టర్. కాలానికి తగ్గట్లుగా యువతతో పోటీ పడుతూ ఆయన ఎప్పటికప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నారు. కానీ ఆయన వచ్చే ఎన్నికల నాటికి ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పడం కష్టం. ఆయన వయసు అప్పటికి ఎనభై దరిదాపుల్లోకి చేరుతుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నా.. ఇప్పటిలా ఆయన నేరుగా క్షేత్ర స్థాయి రాజకీయాలు చేయలేకపోవచ్చు. ఆ బాధ్యతను నారా లోకేష్ తసుకుంటున్నారు. ఇక వైఎస్ వారసుడిగా తెరపైకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. ఇప్పటికే ఓ సారి సీఎంగా చేశారు. ముఫ్పై ఏళ్లు నిరాటంకంగా సీఎంగా ఉండాలని ఆయన అనుకన్నారు కానీ .. మొదటికే మోసం వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు రేసులో ఉన్నారు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన సీఎం పదవిపై ఏమీ చెప్పకపోవచ్చు కానీ రాజకీయాల్లో ఎవరి లక్ష్యమైన ఉన్నతమైన పదవే. అందుకే.. వచ్చే ఎన్నిల నాటికి చంద్రబాబు..తెర వెనుక కీలక పాత్ర పోషిస్తే..తెర ముందు మాత్రం లోకేష్, జగన్, పవన్ లే పోటీ పడనున్నారు. అంటే ఏపీలోనూ యూత్ రాజకీయం నడుస్తుందన్నమాట. తమిళనాడులో వారసత్వ రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. జయలలితకు వారసులు లేకపోడవంతో అన్నాడీఎంకేకు యువనేతల కొరత వచ్చింది. కానీ కరుణానిధి వారసుడిగా స్టాలిన్ తెరపైకి వచ్చారు. ఇప్పుడు స్టాలిన్ వారసుడిగా ఉదయనిధి కూడా వచ్చేశారు. సినీ నిర్మాతగా, హీరోగా తమిళ సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఉదయనిధి తాత, తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని భవిష్యత్ డీఎంకే యువనేతగా ఎదుగుతున్నారు. మొదట డీఎంకే యువత విభాగానికి నాయకత్వం వహించారు. గత ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మంత్రి పదవి కూడా వచ్చింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టులోకి వెళ్లిపోయారు. తన వారసుడిగా ఉదయనిధిని స్టాలిన్ అనధికారికంగా ఖరారు చేసినట్లే అనుకోవాలి. స్టాలిన్‌కు ఇప్పటికే వయసు 70 దాటిపోయింది. తమిళ రాజకీయాల్లోకి కొత్తగా దళపతి విజయ్ వస్తున్నారు. దళపతి విజయ్ సీనియర్ హీరో. ఆయనకు తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన భవిష్యత్ లో కీలక నేతగా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. తమిళనాట వ్యక్తి ప్రాధాన్య రాజకీయాలు ఎక్కువే. అలాగే ఉదయనిధి స్టాలిన్‌కు రాజకయంగా ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.కానీ విజయ్ లాగా మాస్ ఇమేజ్ వచ్చే సినిమాలు చేయలేదు. కానీ అనుచరులకు మాత్రం లోటు లేదు . అందుకే తమిళనాడులో వచ్చే రాజకయం అంతా ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరుతోనే ఉంటుంది. అంటే తమిళనాడులోనూ యువ రాజకీయమే నడవనుంది. దక్షిణాదిలో ఎంతో మంది సీనియర్లు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారిలో చాలా మంది యాక్టివ్ గా ఉన్నట్లే. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ , స్టాలిన్ వంటి వారు వచ్చే ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయిలో ఇప్పుడున్నంత చురుకుగా పని చేయలేకపోవచ్చ. కానీ యువనేతలు మాత్రం రాజకీయ రంగాన్ని దున్నేయగలరు. వారసులే కాదు.. సొంతంగా రాజకీయాల్లోకి ఎదిగిన వారు కూడా తమదైన ముద్ర వేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *