ZPHS Balapur: ప్రారంభానికి ముందే కుంగిన ఫ్లోరింగ్…

సిరా న్యూస్, జైనథ్:

ప్రారంభానికి ముందే కుంగిన ఫ్లోరింగ్…

– బాలాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల నూతన భవనం దుస్థితి

– అసంపూర్తిగా నిర్మాణ పనులు

– అవస్థలు పడుతున్న విద్యార్థులు

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లోని బాలాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ. 30 లక్షల ఎస్.డి.ఎఫ్ నిధులతో నిర్మించిన పాఠశాల భవనంలో ప్రారంభోత్సవానికి ముందే ఫ్లోరింగ్ కుంగిపోయింది. 2019 లో పాఠశాలలో 4 అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. అప్పటినుండి అనేక కారణాలతో పనులు నత్తనడకన కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ కూడా, వైరింగ్, కలరింగ్, మెట్ల నిర్మాణం వంటి పనులు ఇంకా పూర్తి కాలేదు. అప్పట్లో మంజూరు చేసిన రూ. 30 లక్షలు నిధులు సరిపోకపోవడంతో పనులు మధ్యలో ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తరగతి గదుల్లో వేసిన ఫ్లోరింగ్ చాలావరకు కుంగిపోయింది. టైల్స్ బయటకు తేలడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే మెట్ల మార్గం ద్వారా నీళ్లు లోపలికి వస్తున్నాయని, భవనంలో వైరింగ్ పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదని స్థానికులు చెబుతున్నారు. పనులు నాసిరకంగా చేపట్టడంతోనే ప్రారంభానికి ముందే ఫ్లోరింగ్ కుంగిపోయిందని ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోని వెంటనే పనులు పూర్తి చేయాలని, నాసిరకంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరగతి గదులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ భవనం పై శ్రద్ధ చూపి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చి, వారి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *