రెండుసార్లు ఆశీర్వదించారు అభివృద్ధి చేశా..
మూడోసారి పట్టం కట్టండి
– సైదాపూర్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం
హుస్నాబాద్ : (సిరా న్యూస్)
అభివృద్ధి సంక్షేమ పథకాల రథసారధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దినదినాభివృద్ధి చెందుతుందని ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని.. ఢిల్లీ నాయకుల చేతిలోకి తెలంగాణ వెళితే రాష్ట్రం మళ్ళీ చీకటిమయం అవుతుందని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు.సోమవారం సైదాపూర్ మండలంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్, హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మాజీమంత్రి పెద్దిరెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 2014 కంటే ముందు పరిస్థితులు ఏ విధంగా ఉండే, గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరూ గమనించాలని సూచించారు. ఎలక్షన్ల అప్పుడే కనబడే ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దని, మీ వాడిని, మీలో ఒకడిని, అడిగిన ప్రతి పని చేస్తూ నియోజకవర్గాన్ని సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలలో అభివృద్ధి చేశానని.. మున్ముందు నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు అధికారం పై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని నియోజకవర్గ ప్రజలు తెలివైన వారు, ఉద్యమకారులు, విజ్ఞానవంతులు, మంచి, చెడు తెలిసినవారు అభివృద్ధిని చూసి మరొకసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని సతీష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.