అసత్యపు ఆరోపణలు మానుకోవాలి -పుట్ట మధుకర్ కు మాజీ మావోయిస్టుల హెచ్చరిక

                                                                          మంథని,(సిరా న్యూస్);
ముత్తారం మండలం ఓడేడ్  సర్పంచ్ బక్కారావుపై మంగళవారం రాత్రి మహా ముత్తారం మండలం మీనాజీపేటలో జరిగిన దాడిని మాజీ మావోయిస్టు నేత బంగారపు చంద్రన్న తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దాడిపై మంథని నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంథని ఎమ్మెల్యే మాజీ నక్సలైట్లకు లైసెన్సు లేని తుపాకులు కత్తులు ఇచ్చి దాడులు చేయిస్తున్నారని మధుకర్ చెప్పడం ఆయన దిగజారుడు చర్యకు నిదర్శనం అన్నారు. కొన్ని దశాబ్దాలు ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు  పోరాటం చేసిన తమను పుట్ట మధుకర్ అవమానపరిచేలా ప్రకటనలు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే పైన నక్సలైట్లకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఇచ్చిన హామీపై లొంగిపోయిన నక్సలైట్ల విషయంలో ఎలాంటి  సానుకూల చర్యలు చేపట్లేదని తెలుపుతూ 5 ఎకరాల భూమి రెండు గంటల ఇంటి స్థలం ఇప్పిస్తానని పుట్ట మధుకర్ ఇచ్చిన హామీ ఎమ్మెల్యే అయిన తర్వాత నిలబెట్టుకోలేకపోయాడన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము కూడా తమ వంతు సహకారం అందించామని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో తామంతా పుట్ట మధుకర్ కు అండగా ఉన్నామని అప్పుడు తమ వద్ద  ఆయుధాలు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆయన గుర్తు చేస్తూ దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు,రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడుతున్న ఎన్నికల్లో పాల్గొనే హక్కు ప్రతి పౌరుడికి ఉందని ఈ విషయాన్ని మరిచి మాపై కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని వారి చర్యలను విద్యార్థులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు గ్రహించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ నక్సలైట్లు కొమురయ్య, చంద్రు శ్రీనివాస్, యేసుల పోచం, జంజర్ల శ్రీను, బొమ్మ బాపురెడ్డి, కండె గట్టయ్య, గాడెపు బానేష్,  అడప శంకరయ్య, పావిరాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *