విజయవాడ,(సిరా న్యూస్);
ఏపీలో ఎన్నికల లెక్కలు మారుతున్నాయి. తెలంగాణ ఫలితాలు వెల్లడి తరువాత ఇక ఏపీలో రాజకీయం వేడెక్కనుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. తెలంగాణలో బీజేపీకి మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన పవన్.. ఏపీలో తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నిర్ణయం ఏంటనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఢిల్లీ పరిణామాలపైన స్పష్టతతో ఉన్న జగన్ తన మార్క్ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఏపీలో నయా సమీకరణాలు:తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి కానున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకోనుంది. ఏపీలో టీడీపీతో జత కట్టిన పవన్ కల్యాణ్..తెలంగాణలో బీజేపీ తో ముందుకు వెళ్తున్నారు. అక్కడ టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో, ఏపీ మూలాలు ఉండి తెలంగాణలో స్థిర పడిన ఓటర్లు బీజేపీ – జనసేనకు మద్దతిస్తారని కమలం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ, అక్కడ టీడీపీ మద్దతు దారులు నేరుగా ప్రియాంక ర్యాలీల్లో పార్టీ జెండాలతో హాజరు కావటం…ఖమ్మం వంటి జిల్లాల్లో టీడీపీ నేతలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించటంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇక, తెలంగాణలో పవన్ ఏ స్థాయిలో సహకరించారనేది కౌంటింగ్ తో స్పష్టం కానుంది. ఏపీలో బీజేపీ మద్దతు పొందేందుకే తెలంగాణలో కాషాయం పార్టీకి వపన్ సహకరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ,ఆ లెక్కే ఏపీలో ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తో పొత్తు విషయంలో చంద్రబాబు, పవన్ సానుకూలంగా ఉన్న టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి దాదాపు 40-45 సీట్లు కేటాయించాల్సిన పరిస్థితులు ఉంటాయని..అది వైసీపీతో హోరా హోరీగా జరిగే పోరులో తమకు నష్టం చేస్తుందనేది టీడీపీ నేతల అంచనా. అదే సమయంలో అసలు బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత బీజేపీ ఢిల్లీ నాయకత్వం గుంభనంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో టీడీపీ కేడర్ కాంగ్రెస్ కు సహకరిస్తున్న అంశం బీజేపీ పైన ప్రభావం చూపించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.ఇక, ఇటు చంద్రబాబు కేసుల చక్రబంధంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలే సమయం ఉంది.