కాంగ్రెస్ కు ఎమోషనల్ డ్యామేజీ……

హైదరాబాద్, (సిరా న్యూస్);
సరాగా అవుతాడని ఎన్నికల ప్రచారానికి పిలిస్తే.. అసలుకే ఎసరు పెట్టారని ఆ సీనియర్ నేతపై టి.కాంగ్రెస్ నేతలు ఉసూరుమంటున్నారు. రాక రాక వచ్చి ఎన్నికల వేళ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడంటూ లోలోన గులుగుకుంటున్నారు నేతలు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నాటి కేంద్ర హోంమంత్రిగా చిదంబరంతో ఎన్నికల ప్రచారం చేయిస్తే ప్రయోజనం ఉంటుందని భావించారు లోకల్ కాంగ్రెస్ లీడర్. కానీ, ఆ ప్లాన్ కాస్తా చిదంబరం వ్యాఖ్యలతో బెడిసికొట్టింది. ఆయన వస్తే ప్రయోజనం ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆయన చేసిన కామెంట్స్‌ను కవర్ చేయడానికి తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన చిదంబరం.. అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ ఏర్పాటైందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఇందుకు క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు. చిదంబరం చేసిన ఈ ఒక్క మాట.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.కాంగ్రెస్ మాంచి దూకుడుమీదున్న ఈ సమయంలో చిదంబరం చేసి ఒక్క కామెంట్.. అంతా తలకిందులు చేసేసింది. కాంగ్రెస్‌కు చిదంబరమే విలన్‌గా మారారంటూ ఆ పార్టీలోనే కిందిస్థాయి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పని చేశావ్ చిదంబరం.. ఎమోషనల్ డ్యామేజ్ చేశావ్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ యువకుల ఆత్మహత్యలు జరిగినట్లు చిదంబరం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ వ్యాప్తంగా ఫ్లెక్సీ వార్‌ నడుస్తోంది. తెలంగాణ యువకుల ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమంటూ ప్లెక్సీలు వెలిశాయి. రాహుల్ గాంధీ రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ప్రత్యర్థులు. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్‌ను బతకనివ్వొద్దూ అంటూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు వెలిశాయి. అమరుడు శ్రీకాంతాచారితో పాటు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *