తిరుపతి, (సిరా న్యూస్);
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ కనిపించకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనను తెలంగాణ ఎన్నికల కోసమే పార్టీలోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ఆయన కనిపించారు. సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఉపయోగపడతారని కమలం పార్టీ అంచనా వేసి మరి అక్కున చేర్చుకుంది. ఆయన వల్ల కొన్ని ఓట్లు అయినా రాకపోతాయా? అని భావించి మరీ కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పేసింది. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఆయన స్వాగతం పలుకుతూ ఎయిర్‌పోర్టులో కనిపించారు. ఇక కాంగ్రెస్ లో కొన్నేళ్లు పాటు ఉన్నా సైలెంట్ గా ఉన్న కిరణ‌్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్ అవుతారని భావించారు. అయితే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు బాగా పనికొస్తాడని, పనిమంతుడని నమ్మి పార్టీలో చేర్చుకున్నారు. పైగా మాజీ ముఖ్యమంత్రి అన్న ట్యాగ్ మెడకు వేలాడుదీసుకుని తిరుగుతుండటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. ఆయన పార్టీలో చేరితే రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కమలం వైపు చూస్తారని భావించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల తెలంగాణలో లాభం కంటే నష్టమే ఎక్కువ అని గ్రహించినట్లుంది.