వరంగల్, (సిరా న్యూస్);
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో వ్యయం అనూహ్యంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి చేస్తున్న ప్రచార వ్యయం పెరిగింది. ప్రచారానికి రథాలు, వాహనాలు, ప్రచార సామాగ్రి, డిజిటల్ బోర్డులు, కరపత్రాలు, పార్టీ జెండాలు, కండువాలు, డోర్ పోస్టర్లతో అభ్యర్థులు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. దీంతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలకు భోజనం, మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ కూడా తప్పటం లేదు.దీంతో ఒక్కో అభ్యర్థి ఒక రోజుకే రూ.20 నుంచి రూ.50 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.40 లక్షల లోపే ఉండాలని ప్రచార పరిమితిని విధించింది. బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఒక్కో అభ్యర్థికి రూ.40లక్షల పార్టీ ఫండ్ చెక్కులను అందజేసింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులకు పార్టీ ఫండు ఇస్తున్నా, పెరిగిన ప్రచార వ్యయానికి అనుగుణంగా నిధులు సరిపోవడం లేదు.ప్రధాన రాజకీయ పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అవుతున్న వ్యయాన్ని భరించలేమని చేతులెత్తేస్తున్నారు. ఉద్యమకారుల కోటాలో పార్టీ టికెట్లు దక్కిన అభ్యర్థులు, రిజర్వుడు స్థానాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయం భరించడం కష్టంగా మారింది. ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధుల కోసం కొందరు అభ్యర్థులు ఆస్తులను సైతం అమ్ముకుంటున్నారు.కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయాన్ని భరించడం కోసం హైదరాబాద్ నగరంలో ఉన్న భూములను అమ్ముకున్నారని సమాచారం. పలువురు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం తమ ఆస్తులను తెగనమ్ముకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. మరో వైపు కొందరు అభ్యర్థులు కాంట్రాక్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఫామ్ హౌస్ లను తనఖా పెట్టి డబ్బులు సమకూర్చుకుంటున్నారని సమాచారం.మరికొందరు ఎన్నారై స్నేహితుల నుంచి డబ్బును అప్పుగా తీసుకున్నారని అంటున్నారు.