సిరా న్యూస్, చిగురు మామిడి:
నీటి ఎద్దడి నివారణ ముందస్తు చర్యలు చేపట్టాలి.
–జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాస మధుసూదన్ ను స్థానిక జడ్పిటిసి సభ్యులు గీకురు రవీందర్ కోరారు. తాగునీటి సమస్య నివారణ చర్యల నిమిత్తం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జడ్పిటిసి సభ్యులు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ తో సమావేశమై నీటి సమస్యపై చర్చించారు. మండల ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీటి సమస్యలు రావద్దని, ఆయా గ్రామాల్లో ముందస్తుగానే సమస్యలను గుర్తించాలన్నారు. మిషన్ భగీరథ, గ్రామీణ నీటి పారుదల శాఖా అధికారులు నీటి సరఫరా, పైప్ లైన్లు నిర్వహణలో శ్రద్ద వహించాలన్నారు. సర్పంచుల పదవీ కాలం పూర్తయి, ప్రత్యేక అధికారుల నియామకం తర్వాత మండల సమావేశం నిర్వహించలేదని, తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పంచాయితీ కార్యదర్షులు, అధికారులు హరితహారంలో నాటిన మొక్కలను ఎండిపోకుండా కాపాడాలన్నారు. నిధుల విషయములో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, గ్రామ పంచాయితీ నిధులతో పాటు మంత్రి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో జడ్పీటిసి సభ్యులతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ కుమార్, కాంగ్రెస్ నాయకులు గునుకుల రాజేశ్వర్ రెడ్డి, చెల్పురి విష్ణుమాచారి, సుపరిండెంట్ ఖాజా మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.