సిరా న్యూస్,హైదరాబాద్;
మారిన రాజకీయ పరిస్థితులు, సామాజిక మాధ్యమాలతో ఎన్నికల ప్రచార శైలి కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ప్రచారం అంటే పత్రికలు, టీవీల్లో ప్రకటనలు, కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం… ఇలా ఉండేది. ఇదంతా కూడా అభ్యర్థికి అత్యంత సన్నిహితులో, పార్టీ ఇంఛార్జులో చూసుకునేవారు. క్షేత్రస్థాయిలో శ్రేణుల ద్వారా సమాచారం తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా ప్రచార పద్ధతిని అనుసరించేవాళ్లు. కానీ… ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ/ కన్సల్టెన్సీ ఏజెన్సీలు వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఫీజు చెల్లిస్తే చాలు… గెలుపు వ్యూహాలు మొత్తం చూసుకుంటారు. గెలుపు కోసం అన్ని విధాల కృషి చేస్తుంటారు. గెలుపోటములు ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంటాయి. కానీ… ఆ తీర్పును ప్రభావితం చేసేలా కూడా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక నయా ట్రెండ్ నడుస్తోంది.ఒకప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే… కూరగాయలు, వంట సామగ్రి తీసుకొచ్చి రకరకాల వంటకాలు తయారు చేసేవాళ్లం. ఉదయం ఫంక్ష ఉందంటే రాత్రంతా నిద్ర మానుకుని కూడా వంటకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేవాళ్లం. కానీ… ఇప్పుడు క్యాటరింగ్ సిస్టమ్ వచ్చింది. ఏయే ఐటమ్స్ కావాలి….? ఎంతమందికి కావాలి…? చెబితేచాలు. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ/ కన్సల్టెన్సీ ఏజెన్సీలు వచ్చిన తర్వాత… అభ్యర్థుల పని కూడా ఇలాగే మారింది. అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం… ఈ ఏజెన్సీల పని. ఇందుకోసం తెరవెనుక అనుసరించే పద్ధతులు, శైలి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. మనం రోజూ చూస్తున్న చాలా ప్రచారాలు… వాటి వెనుక జరుగుతున్న కుకింగ్ పద్ధతులు చూస్తే… అమ్మో ఇంత తతంగముందా..? అని ఆశ్చర్యం కలుగుతుంది.రోజూ సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్ వీడియోలు, మీమ్స్, పాజిటివ్, నెగిటివ్ క్యాంపెయినింగ్ కంటెంట్ చూస్తుంటాం.ఉదాహరణకు క్షేత్రస్థాయిలో దశలవారీగా సర్వేలు చేస్తుంటారు. అక్కడి పరిస్థితులు, క్లయింట్ అనుకూల, ప్రతికూల పరిస్థితుల్ని తెలుసుకుంటారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తారు. సమస్య ఏంటి… అధిగమించడం ఎలా అనే ప్రధానమైన విధిగా ఏజెన్సీలు నడుస్తుంటాయి