సిరా న్యూస్,చీరాల;
పిడుగు పాటుకు నూతక్కి తులసీ అనే యువతి మృతి చెందిన విషాద ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం పాతచీరాలలో చోటుచేసుకుంది. తెల్లవారుజాము నుండే చీరాల ప్రాంతంలో ఉరుములతో కూడిన చెదురు మదురు జల్లులు కురిశాయి.ఇదే క్రమంలో బట్టలు ఆరేసేందుకు డాబా పైకి వెళ్ళిన తులసి పై ఒక్కసారిగా పిడుగుపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.బాపట్ల లో నివాసం వుంటూ అగ్రికల్చర్ కాలేజీలో ఫుడ్ & టెక్నాలజీ కోర్సు చదువుతున్న తులసి దసరా సెలవులకు చీరాల అమ్మమ్మ సరోజిని ఇంటికి వచ్చి పిడుగు పాటుకి బలైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.తమ ఒక్కగాను ఒక్క కుమార్తె పిడుగు పాటుకి బలికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.