సిరా న్యూస్,హైదరాబాద్;
పాతికేళ్లకు పెళ్లి చేసుకోవాలి.. ముఫ్పై ఏళ్లు దాటితే పిల్లను ఇవ్వడానికి ఎవరూ పెద్దగా ముందుకు రారు..అంత కన్నా ముదిరిపోతే ఇక లైఫ్ లాంగ్ బ్యాచిలర్‌గా ఉండిపోవాలన్న భయం ఉన్న రోజులు ఇవి. అయితే హైదరాబాద్‌లోని ఓ పెద్ద మినిషి మాత్రం 69 ఏళ్లకు కూడా పెళ్లి చేసుకోవచ్చన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య అనారోగ్యంతో చనిపోవడంతో తోడుగా ఓ వ్యక్తి ఉండాలనుకుని పెళ్లి చేసుకునేందుకు వధువు కావలెను.. రెండో వివాహం అయినా పర్వాలేదు అని ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్‌లో ప్రకటన ఇచ్చాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. ఆ మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని కొంతమంది కాల్ చేశారు. కొన్ని కాల్స్ తర్వాత చత్తీస్ ఘఢ్ నుంచి ఓ మహిళ నుంచి కాల్‌కు ఆ పెద్దాయన ఆకర్షితుడయ్యాడు. తన పేరు లలితా శుక్లా అని పరిచయం చేసుకున్న ఆ మహిళ పెళ్లి చేసుకోవడానికి అంగీకిరంచింది. అయితే ముందుగా ఫోన్‌లో మాట్లాడుకుని మనసులు తెలుసుకుందామని చెప్పడంతో ఆ పెద్దాయన అంగీకరించాడు. ఇలా మాటలు చెప్పుకుంటున్న సమయంలోనే ఆ లలితా శుక్లాకు చాలా కష్టాలు వచ్చాయి. ఓ సారి తన తల్లిదండ్రులకు..మరోసారి సోదరుడుకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కూడా ఆమె కుటుంబం చాలా సార్లు ఇబ్బందుల్లో పడింది. అన్ని సార్లు ఈ పెద్దాయనే ఆదుకున్నారు. అలా కష్టం వచ్చిందని స్వీట్ వాయిస్ తో అడగగానే ఈ పెద్దాయన డబ్బులు పంపేవారు. తన కోసం బతకడానికి వస్తున్న మహిళ కోసం ఆ మాత్రం చేయలేనా అని ఆ పెద్దయన ఎమోషనల్ అయ్యేవాడు. అయితే ఈ కష్టాలు సినిమా కష్టాల్లాగే పెరిగిపోతున్నాయి కానీ.. పెళ్లి చేసుకునే తేదీ మాత్రం దగ్గరకు రావడం లేదు. పెళ్లి సంగతి తర్వాత కనీసం కలుద్దామన్నా రావడం లేదు… తాను వస్తానన్నా అంగీకరించడం లేదు. దీంతో ఈ కష్టాల వెనుక ఏదో కథ ఉందని పెద్దాయనకు అర్థం అయింది. అప్పటికే రూ. పన్నెండు లక్షలు ఆమెకు సమర్పించుకున్నారు. అనుమానం వచ్చిందని తెలిసిన మరుక్షణం ఆ లలితా శుక్లా ఫోన్ మూగబోయింది. డిస్ కనెక్ట్ అయిపోయింది. దీంతో ఈ పెద్దాయన తనకు పెళ్లి అయ్యే చాన్స్ లేదని ఆ పేరుతో తన దగ్గర ఉన్న పన్నెండు లక్షల డబ్బు నొక్కేశారని తెలుసుకుని షాక్ కు గురయ్యాడు. తేలుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేటు వయసులో పెళ్లి కోసం ప్రయత్నించడం ఓ ఎత్తు అయితే .. కుర్రాళ్లు మాట్లాడుకున్నట్లుగా ఫోన్లో రొమాంటిక్ కబుర్లు చెప్పుకుని పూర్తిగా మోసపోవడం ఏమిటని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ లలితా శుక్లా గురించి ఆరా తీస్తున్నారు.