1931 జనాభా లెక్కలేనా….

సిరా న్యూస్;
దేశంలో సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించాలన్నా.. వెనుకబడిన వర్గాలు ముందుకు వెళ్లాలన్నా.. కులగణన ఒకటే మందు అని చాలా మంది నమ్ముతున్నారు. జమానా లెక్కలు కాకుండా లేటెస్ట్ సెన్సెస్ తోనే అసలైన పేదల గుర్తింపు సాధ్యమవుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేయబోతున్న సర్వే దేశానికే రోల్ మోడల్ గా ఉంటుందంటున్నారుబీసీలకు రిజర్వేషన్లు, వారి జనగణన ఇష్యూ దేశవ్యాప్తంగా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. దేశంలో బీసీల జనాభా లెక్కలు తీయాలన్న డిమాండ్లు ఈనాటివి కావు. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం ఈ లెక్కలు తీసేందుకు ముందుకు రావడం లేదంటున్నాయి విపక్షాలు. అసలు బీసీల్లో ఏయే కులాల్లో ఎంత మంది ఉన్నారన్న విషయం తెలిస్తే వారి సమగ్ర సంక్షేమానికి వీలవుతుందని బీసీ సంఘాల ఆలోచన. అందుకోసం బీసీ జనగణన ఒక్కటే మార్గమంటున్నారు.దేశ జనాభాలో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. బీసీల సంఖ్య 70 కోట్ల ఉన్నట్లు ఓ అంచనా ఉంది. ఆ లెక్కన ఇది 56 శాతం. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే ఇప్పటికీ బీసీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయంటున్నారు. పదేళ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా.. అందులో దళితులు, గిరిజనుల సంఖ్యపై మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే జనాభాలో ఓబీసీతో పాటు ఏ ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. దేశంలో 1931లో చేసిన జనాభా లెక్కలే సంపూర్ణంగా కులగణనలతో చేసిన సమగ్ర లెక్కలుగా ఉన్నాయంటున్నారు.ఇప్పటికీ అవే ఆధారంగా మారాయి. 1979లో బీపీ మండల్ నేతృత్వంలో రెండో బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ బీసీల జనాభాను 52 శాతంగా లెక్కగట్టి వీరికి విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 1980లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ సిఫార్సులు 1992 నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలో 3,743 కులాలను బీసీలుగా మండల్ కమిషన్ తేల్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లిస్టులో 2,479 కులాలు మాత్రమే ఉన్నాయి. సర్వే చేస్తేనే బీసీల్లో ఉన్న కులాల లెక్క తేలే ఛాన్స్ ఉందంటున్నారు.2017లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ను నియమించింది. ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్ పని. ఇప్పటికి ఈ కమిషన్ గడువును 13సార్లు పొడగించారు. ప్రస్తుతం బీసీల జనగణనపై కాంగ్రెస్, జేడీయూ, సమాజ్ వాదీ సహా మరికొన్ని పార్టీలు అగ్రెసివ్ గా వెళ్తున్నాయి. వీలైన ప్రతిసారీ మోడీ సర్కార్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. బీసీ కుల గణనతో చాలా లాభాలు ఉన్నాయని బీసీ సంఘాలు, విపక్షాలు అంటున్నాయి. వెనుకబడిన మెజార్టీ ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు చేయడం, జనాభాకు తగ్గట్లుగా విద్యా, ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిథ్యం దొరకడం, బీసీల్లోని పేదలకు రిలీఫ్ లభిస్తుందని అంటున్నారు.సీన్ కట్ చేస్తే బీసీల లెక్కలు తీసేందుకు మోడీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయి. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని తెలిపింది. అయితే దీన్ని విపక్షాలు, బీసీ సంఘాలు తప్పు బట్టాయి. బీసీ కులాల వారీ లెక్కలు తీస్తే అందరికీ రిజర్వేషన్లు కల్పించడం కష్టమన్న ఆలోచనతో ఉన్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటొద్దని సుప్రీం తీర్పు ఉంది. ఆ లెక్కన చూసినా ఈ సబ్జెక్ట్ ముట్టుకుంటే మొదటికే ఇబ్బంది వస్తుందన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందా అన్నది కీలకంగా మారింది.నిజానికి 2010లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు.. ఇదే బీజేపీ నాయకులు.. బీసీ కులాల వారిగా లెక్కలు తీయాలని పార్లమెంటులో డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అటు బీసీల కులాల వారీ జనాభా లెక్కలు తీయడంతో పాటే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆర్.కృష్ణయ్య వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోకల్‌‌ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాలంటే, బీసీల లెక్కలు తప్పనిసరిగా ఉండాలని గతంలో సుప్రీం ఆదేశించింది. లేకపోతే రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు జరపాలని గతంలో తీర్పు ఇచ్చింది. దీంతో చాలా రాష్ట్రాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. కొన్ని రాష్ట్రాలు సొంతంగా బీసీల లెక్కలు తీసే పనిలో పడ్డాయి. ఇక తెలంగాణలో ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులను సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆయా ప్రాంతాలలోని జనాభాను బట్టి అక్కడ సిబ్బందిని నియమించారు. ఎన్యూమరేటర్‌ రోజువారీగా తనకిచ్చిన షెడ్యూల్ ప్రకారం సర్వే పూర్తయ్యే వరకు పనిచేస్తారు. నేటి నుంచి జరిగే ఈ సర్వేలో ప్రతి కుటుంబ యజమానిని నేరుగా ఎన్యుమరేటర్ కలిసి వివరాలు సేకరిస్తారు. యజమాని లేకుంటే తగిన ఆధారాలు చెప్పే ఏ కుటుంబ సభ్యుడున్నా సరిపోతుంది. ఇలా సేకరించిన సమాచారం మొత్తం ఈ నెల చివరి నాటికి ఆన్‌లైన్‌లో అప్లోడ్చేస్తారు. సర్వేలో భాగంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, ఉపాధి వంటి అంశాలను సేకరించనున్నారు. వివరాల సేకరణ అనంతరం సంబంధిత ఇళ్లకు స్టిక్కర్లు అంటించనున్నారు. ఏ రోజు.. ఏ గ్రామంలో.. ఏ వార్డులో.. ఏ సమయంలో.. సర్వే చేయపట్టనున్నారనే సమాచారాన్ని ముందే ఆయా ప్రాంతాల్లోని వారికి చాటింపు, మైకుల్లో ప్రచారం ద్వారా తెలియజేస్తారు. సర్వేలో భాగంగా ఎలాంటి ఫొటోలు, గుర్తింపు పత్రాలు స్వీకరించరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *