సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికలకు దూకుడు పెంచుతోంది టీడీపీ. వచ్చే నెల(జనవరి) నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు టీడీపీ నేత చంద్రబాబు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే)తో భేటీ అయిన చంద్రబాబు, లోకేశ్.. పీకే ప్రణాళికలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 25 పార్లమెంట్ స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉన్నారు చంద్రబాబు.ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. చంద్రబాబు సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ. చంద్రబాబు 25 సభలు ఎక్కడ నిర్వహించాలి? అనే అంశంపైనా ప్రణాళిక రచిస్తున్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, సూచనలను అమలు పరచనుంది. జనవరిలో పూర్తి ప్రణాళికను అమలు చేయబోతున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, ఆ సభలో లక్ష మంది జనసమీకరణ చేయాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు పీకే. దీనిపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు.జనవరి 5 నుంచి రాయలసీమ నుంచి ఈ బహిరంగ సభల కాన్సెప్ట్ ను చంద్రబాబు ప్రారంభించబోతున్నారని సమాచారం. రోజుకు రెండు బహిరంగ సభలు అంటే ఒక్కో పార్లమెంటు పరిధిలో ఒక్కో సభ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఒక బహిరంగ సభ చాలని పార్టీ నేతలు చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు. సభలు రోజుకు ఒకటా? రెండా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.జనవరి 5 నుంచి చంద్రబాబు ప్రజల మధ్య ఉండబోతున్నారు అనేది మాత్రం ఖాయంగా తెలుస్తోంది. పార్లమెంటుకు ఒక బహిరంగ సభ చొప్పున 25 సభలు పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది. మరోవైపు రేపటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. జనవరి 1న పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 2వ తేదీన పీకే ఆలోచనలకు తగ్గట్టు బలహీనవర్గాలకు సంబంధించిన ప్రచార రథాలను ప్రారంభించబోతున్నారని సమాచారం.ఒక పార్లమెంటు స్థానానికి రెండు ప్రచార రథాలను ప్రారంభించబోతున్నారు. అంటే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 50 ప్రచార రథాలను రెడీ చేయనున్నారు. జనవరి 2న ప్రచార రథాలను చంద్రబాబు లాంచ్ చేయబోతున్నారు. 5వ తేదీ నుంచి పార్లమెంటుకు ఒక బహిరంగ సభను చంద్రబాబు ప్రారంభించబోతున్నారు.జనవరి నెలాఖరుకల్లా ఈ బహిరంగ సభల కాన్సెప్ట్ ను పూర్తి చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి తిరుపతిలో మ్యానిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా పీకే ప్రణాళికలను పూర్తి స్థాయిలో చంద్రబాబు అమలు జరుపుతున్నారు. బీసీ కాన్సెప్ట్ కావొచ్చు, పార్లమెంటుకు ఒక బహిరంగ సభ కావొచ్చు.. మొత్తంగా పీకే ఇచ్చిన స్కెచ్ ప్రకారమే టీడీపీ ముందుకెళ్తోంది.