30 చోట్ల ట్రైయాంగిల్ టఫ్ ఫైట్…
వరంగల్, నవంబర్ 18,
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని ఇప్పటికే అనేక ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. ఓటరు నాడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పలుసంస్థలు ఈ దఫా విజయం హస్తానిదేనని తేల్చేయగా; మరికొన్ని సర్వేలు సంకీర్ణ ప్రభుత్వాన్ని అంచనా వేశాయి. మరోవైపు ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో ఈ ప్రభావం ఒకే రీతిలో ఉండబోదని; ఉత్తర ప్రాంతంలో కమలం ప్రాబల్యాన్ని అంత సులభంగా తీసిపారేయలేమని పరిశీలకులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మోదీ హైదరాబాద్ పర్యటన అనంతరం కాషాయ శిబిరమూ అప్రమత్తమై క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టింది. వలసలు పోగా మిగిలిన పాతకాపులు, బలమైన నాయకత్వానికి క్షేత్రస్థాయి కార్యకర్తల సత్తువ తోడై ఆ పార్టీని ఇప్పటికీ నిర్ణాయక శక్తిగానే నిలిపి ఉంచిందని పలువురు విశ్లేషకుల అంచనా. సాధారణంగా ఎంఐఎంకు లాంఛనప్రాయమని భావించే ఆరు స్థానాలు పోనూ మిగతా 113 నియోజకవర్గాల్లో అధికారానికి అవసరమైన 60 స్థానాల్లో జెండా పాతితేనే ఏ పార్టీ అయినా గద్దెనెక్కేది. తెలంగాణలో అనేక స్థానాలు బీఆర్ఎస్‌కూ, కాంగ్రెస్‌కూ దుర్భేద్యమైనవిగా ఉన్నాయి. ఆ స్థానాలను మినహాయిస్తే ఇప్పుడు ముక్కోణపు పోరులో కమల దళం హోరాహోరీ తలపడుతుందని భావిస్తున్న ఆ 30 ఉత్తర తెలంగాణ నియోజకవర్గాలే కాంగ్రెస్ అయినా, బీఆర్‌ఎస్ అయినా అధికారాన్ని అందుకోవడానికి కీలకమవుతున్నాయి.ఓ దశలో ప్రధాన ప్రతిపక్షమన్న స్థాయిని చేరి; క్రమంగా దిగజారుతూ, ఓ వారం క్రితం వరకూ గణనీయమైన నిస్సత్తువ ఆవరించి ఉన్న బీజేపీలో ప్రధాని మోదీ వరుస పర్యటనలు ఊపును తెచ్చాయి. బీసీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామని ప్రకటించి మెజార్టీ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ హామీ చాలా నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని పెంచే అవకాశముంది. ఇక పసుపు బోర్డు హామీతో ఉత్తర తెలంగాణలోని మూణ్నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలం పెంచుకుంది.ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఏ వర్గాల ఓట్లను ఏ మేరకు తనవైపు మళ్లించుకోగలుగుతుందీ? ఏ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేయబోతున్నదీ? అన్నవి ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయమమయ్యాయి.ఇదిలా ఉంటే సిర్పూరు, పఠాన్చెరు, సూర్యాపేట వంటి నియోజకవర్గాల్లో బీఎస్పీ కూడా హోరాహోరీ తలపడుతున్నది. పెద్దపల్లి వంటి నియోజకవర్గాల్లో యువ అభ్యర్థులు ఏనుగు గుర్తుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.బీజేపీ నుంచి కరీంనగర్‌లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్రెడ్డి, దుబ్బాకలో రఘునందనరావు, హుజూరాబాద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, గోషామహల్‌లో రాజాసింగ్, ఉప్పల్‌లో ఎన్వీఎస్ఎస్ప్రభాకర్, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు, నిజామాబాద్అర్బన్‌లో ధనపాల్ సూర్యనారాయణ వంటి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే, వాళ్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం తమకే మేలు చేస్తుందని బీఆర్ఎస్భావిస్తున్నది. ఓ పది చోట్ల తప్ప బీజేపీకి సొంత ఓటు బ్యాంకు పెద్దగా లేదని, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమనే భావిస్తున్నారని కాంగ్రెస్చెప్తున్నది. బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే మాత్రం సంకీర్ణం వచ్చే అవకాశంలేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.