పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి;
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 335 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపెల్లి జిల్లాలో 2024-25 ఖరీఫ్
మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం 249 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాలు, 84 ఐకెపి కేంద్రాలు, 2 హెచ్.ఏ.సి.ఏ కేంద్రాలు మొత్తం 335 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని
అన్నారు. రైతులు భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకుని రావాలని, ధాన్యం శుభ్రం చేయడం, తేమశాతం వచ్చేలా ఆరబెట్టుకుని కొనుగోలు
కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
మిర్జంపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
జిల్లాలోని శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. కాల్వశ్రీరాంపూర్మండలం మిర్జంపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బి. శ్రీనివాస్ అధికారులకు సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరు కావడం, అనుమతి లేకుండా సెలవు పై వెళ్లడం గమనించి పై అధికారులు పలుమార్లు మెమోలు జారీ చేశారని కలెక్టర్ తెలిపారు. ఉన్నతాధికారులు పలుమార్లు అందించిన సూచనలు ఆదేశాలను పట్టించుకోకుండా, విధులలో చేరమని అక్టోబర్ 26న చివరి అవకాశం ఇచ్చినప్పటికీ విధులలో చేరకపోవడం కారణంగా పంచాయతీ కార్యదర్శి ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బీసీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజాక్రాంతి, పెద్దపల్లి ప్రతినిధి: రంగంపల్లి లో ఉన్న బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో వార్డెన్ అందుబాటులోఉంటున్నారా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, పారిశుధ్యం బాగా ఉందా, స్టడి అవర్స్ జరుగుతున్నాయా వంటి అంశాలను ఆరా తీసిన కలెక్టర్ వసతి గృహం పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజనం నాణ్యత మొదలగు వివరాలను కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.