సిరా న్యూస్;
హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజే వేరు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి ఆహార ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహారపదార్థంగా మన బిర్యానీ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ట్రావెల్ గ్లోబల్.. ఈట్ లోకల్’ అంశంతో పనిచేసే ప్రముఖ ప్రపంచ పర్యాటక ఆన్‌లైన్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించిన ఉత్తమ ఆహార పదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ చోటు సంపాదించుకుంది.సదరు సంస్థ వివిధ దేశాలకు చెందిన నగరాలు, అక్కడి ఆహారపదార్థాలపై సమీక్ష చేసి ఈ స్థానాలను ప్రకటించింది. అందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో హైదరాబాద్ 39వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ముంబై 35వ స్థానం, ఢిల్లీ 56, చెన్నై 65, లక్నో 92వ స్థానంలో నిలిచాయి. ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో ఇటలీ వంటకాలు నిలిచినట్టు ఆ సంస్థ ప్రకటించింది. మన దేశ ఆహార పదార్థాల్లో పావ్‌భాజీ, దోశ, వడాపావ్, కబాబ్స్, పానీపురి, బిర్యానీలను అధికంగా ఇష్టపడుతున్నట్టు పేర్కొంది. మన హైదరాబాద్ విషయానికొస్తే బిర్యానీకే టేస్ట్‌ఫుడ్ అట్లాస్ జై కొట్టింది.