4 నెలల వాన… 4 రోజుల్లో పడింది…

సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ నగరం వారం రోజులకు పైగా జలదిగ్బంధంలో ఉండటానికి అసలు కారణం ఎట్టకేలకు వెలుగు చూసింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం విజయవాడ నగరం మునుపెన్నడు చూడని విపత్తును ఆగస్టు 30- సెప్టెంబర్ 2 మధ్య చవి చూసింది.ప్రధానంగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో విజయవాడ నగరాన్ని ఆకస్మిక వరద ముంచెత్తడంతోనే నగరం అతలాకుతలమైంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా వెలగలేరు దిగువున ఉన్న జక్కంపూడి టౌన్‌షిప్, వైఎస్సార్‌ కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, విధ్యాధరపురం, ఉర్మిళానగర్‌, ఎన్టీఆర్ కాలనీ, అయోధ్య నగర్‌, ముత్యలాయంపాడు, పాయకాపురం, అజిత్ సింగ్‌నగర్‌, కండ్రిక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.దీనికి కారణం విజయవాడ నగరంలోని బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆగస్టు 30-31తేదీల్లో ఏకంగా 32 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌-సెప్టెంబర్ మధ్యకాలంలో నమోదయ్యే సాధారణ వర్షపాతంలో 70శాతానికి పైగా వర్షం కేవలం 48 గంటల్లో విజయవాడలో నమోదైందికనివిని ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు నగరం ఇంకా కోలుకోలేదు.నాలుగు నెలల వ్యవధిలో కురవాల్సిన వర్షపాతం కేవలం 48 గంటల్లోనే కురిసింది.ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలంలో ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు గరిష్టంగా 56.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మైలవరంలో45.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇబ్రహీంపట్నంలో 45.48 సెంటీమీటర్ల వర్షపాతం, వత్సవాయిలో 45.34 సెంటీమీటర్ల వర్షపాతం, గంపల గూడెంలో 42.58 సెంటీమీటర్ల వర్షపాతం, కంచికచర్లలో 40.74 సెంటీమీటర్ల వర్షపాతం, విజయవాడ రూరల్ మండలంలో 40.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.విజయవాడ నగరంలోని పశ్చిమ, సెంట్రల్ నియోజక వర్గంలో నాలుగు రోజుల సగటు 37.86సెం.మీలు, విజయవాడ ఉత్తర ప్రాంతంలో 37.83సెం.మీలు వర్షం కురిసింది. విజయవాడలో అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం లో 32.53 సెంటీమీటర్ల వర్షం నమోదయిందిఆగస్టు 31వ తేదీ ఒక్కరోజులోనే గరిష్ట స్థాయిలో వర్షపాతం నమోదవడం వల్ల బుడమేరుకు భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. ఆగస్టు 31న మైలవరం నియోజకవర్గ పరిధిలో 23.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. విజయవాడ నగరంలో 36.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.బుడమేరు పరివాహక ప్రాంతంలో కీలకమైన జి.కొండూరులో 48 గంటల్లో 45.94 సెం.మీ వర్షపాతం, వత్సవాయిలో 39.71సెం.మీ, ఇబ్రహీంపట్నంలో 39.38సెంటిమీటర్లు, మైలవరం 38.74సెంటిమీటర్లు, గంపలగూడెంలో 35.94సెంటిమీటర్లు, కంచికచర్లలో 35.1సెంటిమీటర్లు, విజయవాడ సెంట్రల్‌లో 32.68 సెంమీ వర్షపాతం కురిసింది.ఆగస్టు 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 8.30 మధ్య 24గంటల వ్యవధిలో ఎన్టీఆర్‌ జిల్లాలో అతి భారీ వర్షం నమోదైంది. జిల్లాలోని వత్సవాయి మండలంలో ఒక్కరోజులో 28.64సెం.మీ, తిరువూరులో 25.62సెం.మీ, జి.కొండూరులో 25సెం.మీ, జగ్గయ్యపేటలో 24.97సెం.మీ, కంచికచర్లలో 24.80 సెం.మీ, గంపలగూడెంలో 22.10, మైలవరంలో 21.34సెంమీ, వీరులపాడులో 20.83సెంమీ. వర్షపాతం నమోదైంది. వెలగలేరు డైవర్షన్ ఛానల్‌కు ఎగువున 24 గంటల వ్యవధిలో కురిసిన అతి భారీ వర్షాలతో బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరం మీదకు వరద ముంచెత్తింది.ఎన్టీఆర్‌ జిల్లాలో ఆగస్టు 30వ తేదీన 14.7.మి.మీ సగటు వర్షపాతం, 31వ తేదీన 12.91సెం.మీ వర్షపాతం, సెప్టెంబర్1న 19.14సెం.మీ వర్షం కురిసింది. మూడు రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో 33.51 వర్షం కురిసింది.
విజయవాడ నగరంలో 31వ తేదీ 24 గంటల వ్యవధిలో ఒక్క రోజులోనే 36.5 సెంటిమీటర్లు వర్షం కురిసింది.మైలవరం నియోజక వర్గంలో 31వ తేదీ ఒక్క రోజే 23.95 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా బుడమేరుకు తీవ్ర స్థాయిలో వరద ముంచెత్తింది. ఎగువన కురిసిన వర్షాలకు విజయవాడలో వర్షం జత కలవడంతో నగరాన్ని ముంచెత్తింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *