సిరా న్యూస్, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న ఏడుగురు అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు వారు నామినేషన్లు దాఖలు చేసారు. ఇప్పటికే స్క్రూట్నీ, ఉప సంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 గురు ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాధారణంగా ఎంపీ పరిది ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడ, ఎమ్మెల్యే పదవికి చాలా క్రేజ్ ఉంటుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఇలా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎంపీలు, బీజేపికి చెందిన మరో ముగ్గురు ఎంపీలు ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం కేవలం ఒక్క ఎంపీ మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం జర్గింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన తన సొంత నియోజక వర్గమైన కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి అసెంబ్లీ బరిలో దిగారు. మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీలో నిలబడ్డారు. 2018 శాసన సభ ఎన్నికల్లో ఆయన హుజూర్ నగర్ నుంచి గెలిచినప్పటికి, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాల మేరకు నల్గోండ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మరల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీకి సై అంటున్నారు. ఇక మరో కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన మరల నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్తి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి బి.వినోద్ కుమార్‌పై గెలుపొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ప్రస్తుత ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాబురావు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా ఆయన బోథ్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి అసెంబ్లీ బరిలో సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీలో ఉన్నారు. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన వీల్ చైర్లోనే వచ్చి నామినేషన్ వేయడం జర్గింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల యుద్దంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మొత్తం ఏడుగురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండటంతో ఆసక్తికరంగా మారింది.