సిరా న్యూస్,న్యూఢిల్లీ;
కేంద్ర ప్రభుత్వం సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. ఇందుక్కారణం పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడమే. ప్రతి 4 పోస్టులకు 1 ఖాళీగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వేతనాలు, భత్యాలు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2023 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 24% పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే మంజూరైన పోస్టుల సంఖ్య కూడా క్రమేణా తగ్గిపోతుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 40 లక్షల సాధారణ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఇవి కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ పరిధిలో ఉన్న సాయుధ బలగాల పోస్టులతో సంబంధం లేనివి. వీటిలో 9.7 లక్షల పోస్టులు ఖాళీగా పడి ఉన్నాయి. అంటే మొత్తం పోస్టులు 40 లక్షలతో పోల్చితే దాదాపుగా నాలుగో వంతు.ఈ ఖాళీల్లో అత్యధికంగా గ్రూప్-C (నాన్ గెజిటెడ్) కేటగిరీలో 33 శాతానికి పైగా ఖాళీలు ఉండగా, గ్రూప్-B (గెజిటెడ్)లో 16% వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడడానికి కారణాలను నివేదికలో ప్రస్తావించినప్పటికీ.. నియామక ప్రక్రియలో జాప్యమే ఖాళీల సంఖ్య పెరగడానికి ముఖ్య కారణమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పదవీ విరమణల కారణంగా ఏర్పడుతున్న ఖాళీలను ఆ మేరకు భర్తీ చేయకుండా, ఆ పని చేసేందుకు వివిధ ఏజెన్సీలకు ఔట్ సోర్సింగ్ ఇవ్వడం కూడా ఒక కారణమని ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరిని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కొందరిని తీసుకుంటున్నాయి. ఈ విధానం ప్రభుత్వాలపై ఆర్థిక భారాన్ని చాలా వరకు తగ్గిస్తున్నాయి. మరోవైపు రోజువారీ ప్రభుత్వ కార్యాకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ‘పీఎం రోజ్‌గార్ మేళా’ పేరుతో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. అలా నియమించినవారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందించారు. ఇలా ఇప్పటి వరకు 13 రోజ్‌గార్ మేళాలను నిర్వహించగా.. చివరి మేళాలో 51,000 మందికి నియామక పత్రాలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది.కేంద్ర ప్రభుత్వంలో సాయుధ బలగాలను మినహాయించి సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధిక సంఖ్యలో సిబ్బందిని కలిగిన శాఖలు 5 ఉన్నాయి. వాటిలో మొదటి స్థానం రైల్వేదే. ఆ తర్వాత రక్షణ శాఖ (సివిల్), హోంశాఖ, పోస్టల్, రెవెన్యూ విభాగాలున్నాయి. ఈ 5 విభాగాలు కలిపి మొత్తం సిబ్బంది సంఖ్యాబలంలో 92% ఉన్నాయంటే ఇవి ఎంత పెద్ద విభాగాలో అర్థం చేసుకోవచ్చు.ప్రతి 10 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో దాదాపు 4 ఉద్యోగాలు రైల్వే రైల్వే ఒక్కటే అందిస్తుంది. గణాంకాల ప్రకారం రైల్వే శాఖలో మొత్తం 14.89 లక్షలకు పైగా పోస్టులు ఉండగా.. ప్రస్తుతం ఉన్న సిబ్బంది 11.73 లక్షలు మాత్రమే. అంటే ఒక్క రైల్వే శాఖలోనే 3 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు హోం మంత్రిత్వ శాఖలో 11.12 లక్షల పోస్టులు ఉండగా.. ప్రస్తుత సంఖ్య 9.84 లక్షల వరకు ఉంది. ఈ లెక్కన ఈ శాఖలో దాదాపు 1.28 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.రక్షణశాఖలో ఉన్న సివిలియన్ పోస్టులు 5.77 లక్షలు ఉండగా.. వీటిలో 2.44 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే మాదిరిగా పోస్టల్, రెవెన్యూ విభాగాల్లోనూ ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీతం మరియు భత్యం (బోనస్, తాత్కాలిక బోనస్, గౌరవ వేతనం, సంపాదించిన సెలవులు మరియు ట్రావెలింగ్ అలవెన్స్‌లు మినహా) మొత్తం వ్యయం 7 శాతానికి పైగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.56 లక్షల కోట్ల మేర కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడగా.. ఇప్పుడు అది రూ. 2.75 లక్షల కోట్లకు చేరుకుంది. వీటిలో 80% మేర నాలుగు మంత్రిత్వ శాఖలు – రైల్వేలు, రక్షణ (సివిల్), హోం వ్యవహారాలు మరియు పోస్టల్ విభాగాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదిలా ఉంటే.. విద్యావ్యవస్థలో ఖాళీలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖలో.. ముఖ్యంగా దేశంలోని 46 సెంట్రల్ యూనివర్సిటీల్లో 27 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. వీటిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి రిజర్వుడు వర్గాల పోస్టులే ఖాళీగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ.. 2014 నాటికి సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం 37 శాతం పోస్టులు ఖాళీలు ఉన్నాయని, అది ఇప్పుడు 26.8% కు చేరుకుందని తెలిపారు. అంటే యూపీఏ హయాంలోనే ఎక్కువ ఖాళీలు ఉండగా.. తాము వాటిని భర్తీ చేస్తూ ఖాళీల సంఖ్యను గణనీయంగా తగ్గించామని వివరించారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.