సిరా న్యూస్, ఆదిలాబాద్:
అందుబాటులో ధరలో ‘అకిరా’ పనీర్
+ గుడిహత్నూర్‌లో తయారీ ప్లాంట్
+ మహిళ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ
+ రోజుకు 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం
+ స్థానిక రైతుల నుండి పాలను సేకరిస్తున్న యాజమాన్యం
+ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి డిమాండ్
పాల ఉత్పత్తులలో పనీర్ కు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా లభించే పనీర్ తో చేసే వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాంటి డిమాండ్ ఉన్న పనీర్ ను ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో మహిళ సంఘాల సభ్యులు తయారు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానిక రైతుల నుండి సేకరించిన నాణ్యమైన పాలతో పనీర్ ను తయారు చేయడంతో పాటు వ్యాక్యుమ్ ప్యాకేజింగ్‌తో మార్కెటింగ్ సైతం నిర్వహిస్తున్నారు. దీనిపై ‘సిరా న్యూస్’ ప్రత్యేక కథనం…
రోజుకు 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం…
గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన మహిళ సంఘాల సభ్యులు ముండే సత్యభామ, గన్నోజివార్ జయశ్రీ లు కొత్త ఆలోచనతో పనీర్ తయారీ కేంద్రం నెలకొల్పారు. స్థానికంగా రైతుల నుండి సేకరించిన పాలతో పనీర్ తయారీ చేస్తుండటంతో, పాడి రైతులకు కూడ బాసటగా నిలుస్తున్నారు. ఇటీవలే భోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించి, యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20 కిలోల పనీర్ తయారు చేస్తూ గుడిహత్నూర్ మండలంతో పాటు ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, భోథ్, నేరడిగొండ మండలాల్లో అమ్మకాలు చేపడుతున్నారు. త్వరలో రోజుకి 100 కిలోల ఉత్పత్తిని పెంచడంతో పాటు మార్కెటింగ్ చేస్తామని నిర్వహకుల ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆకట్టుకునే ప్యాకేజింగ్… సరసమైన ధరతో…
అకీరా పనీర్ పేరిట స్వంత బ్రాండింగ్‌తో పనీర్ అమ్మకాలను చేపడుతున్నారు. బ్రాండెడ్ పనీర్ లకు ధీటుగా వ్యాక్యుమ్ ప్యాకింగ్ అందించడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. బయట మార్కెట్‌లో కిలోకు రూ. 600 ఉండగా, అకిరా పనీర్ మాత్రం కిలోకు రూ. 420 కే అందించడంతో అమ్మకాలు కూడ జోరుగానే కొనసాగుతున్నాయి. ఎలాంటి కెమికల్స్ కలపకుండా స్థానిక రైతుల నుండి సేకరించిన నాణ్యమైన పాలతో పన్నీర్ ఉత్పత్తి చేయడంతో అకీరా పనీర్ కు మార్కెట్‌లో మంచి ఆధరణ లభిస్తోందని నిర్వహకులు చెబుతున్నారు. 200 గ్రాముల ప్యాకింగ్‌లో లభించే అకిరా పనీర్ నాణ్యతతో పాటు రుచికరంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
==================================
మంచి ఆదరణ లభిస్తోంది…
స్థానిక రైతుల నుండి నాణ్యమైన పాలను సేకరించి పరిశుభ్రమైన వాతావరణంలో పనీర్ తయారు చేయడంతో మార్కెట్‌లో మంచి ఆధరణ లభిస్తోంది. ప్రస్తుతం రోజుకు 20 కిలోల పనీర్ తయారీ, ప్యాకింగ్ చేయడంతో పాటు మేమే మార్కెటింగ్ నిర్వహిస్తున్నాము. త్వరలోనే రోజుకు 100కిలోల పనీర్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంటాము.
–గన్నోజి జయ శ్రీ, ఫౌండర్, అకీరా పన్నీర్