సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ప్రభుత్వం కొత్త క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలవుతున్నా, నేటి వరకు ఆయనకంటూ ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం లేదు. ప్రభుత్వ సమీక్షలు వగైరాలను ఇప్పటివరకు ఇంటినుంచి లేదా సచివాలయం నుంచే నిర్వహిస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయంలో సీఎం అధికార నివాసాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ భవనాన్ని ప్రజాభవన్‌గా పేరు మార్చి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మార్చగా, మరో భాగంలో మంగళ, శుక్రవారాల్లో ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి వాడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ముగియటంతో సీఎం పాలన మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టటంతో బాటు రోజూ సీఎంను కలిసేందుకు వందలాది సందర్శకులు రావటంతో ముఖ్యమంత్రి కోసం పూర్తి స్థాయి క్యాంపు కార్యాలయం అవసరం ఏర్పడింది.దీనికోసం తొలుత నూతన కార్యాలయం నిర్మిస్తే ఎలా ఉంటుందనే కోణంలో అధికారులు అలోచించగా, దానికి ముఖ్యమంత్రి నో చెప్పినట్లు సమాచారం. తన కార్యాలయం కోసం అనవసరంగా ప్రజాధనం వెచ్చించటానికి బదులు.. ఉన్న భవనాల్లోనే ఏదో ఒకదానిని వాడుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు. దీంతో అధికారులు పైగా ప్యాలెస్, పోలీస్ టవర్స్ కార్యాలయంతో బాటు పలు ప్రభుత్వ ఆఫీసులను అధికారులు పరిశీలించారు. వాటిలో భద్రత, సౌకర్యాల పరంగా కొత్త నిర్మాణాల అవసరమయ్యేలా ఉండటంతో, అంతిమంగా, జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీఆర్ హెచ్ఆర్డీసీ) అయితే బాగుంటుందనే అంచనాకు వచ్చారు. సుమారు 45 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంగణంలో ఒకేసారి దాదాపు 150 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన నాలుగు హాళ్లు, 375 ఏసీ రూములు, పరిపాలక మండలి సమావేశం నిర్వహణకు వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో వేర్వేరు బ్లాకులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే రోజువారీ జరిగే కార్యకలాపాలకు భద్రతా పరమైన ఇబ్బందులు కూడా ఉండవనే అంచనాకు వచ్చారు ఎంసీఆర్ హెచ్ఆర్డీసీ ప్రాంగణంలోని గుట్ట మీద ఉన్న బ్లాక్‌లోకి సీఎం క్యాంపు కార్యాలయాన్ని మార్చితే, తక్కువ ఖర్చుతోనే దీనిని క్యాంపు కార్యాలయంగా వాడుకోవచ్చని భావించి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో రేవంత్‌రెడ్డి నివాసం ఉంది. ఇప్పుడు అక్కడి నుంచే సచివాలయం, ప్రజాభవన్‌కు వెళ్తున్నారు. ప్రస్తుతం సీఎం నివాసానికి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి దూరం కూడా తక్కువ కావటం వల్ల రాకపోకలకు సులభంగా ఉంటుందని, ట్రాఫిక్ ఇబ్బందులూ ఉండవని, అలాగే, నగరం మధ్యలో ముఖ్యమంత్రి కార్యాలయం అందుబాటులోకి తీసుకు రావటం వల్ల సామాన్యులకూ అది వెసులుబాటుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక, ఇక్కడున్న మానవ వనరుల అభివృద్ధి సంస్థను ప్రజాభవన్‌లోని మరో భవనంలోకి తరలించనున్నారని తెలుస్తోంది.