సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి వారం క్రితం ప్రమాణం చేశారు. అదే రోజు ప్రగతి భవన్ కంచెను బద్ధలు కొట్టించారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణం చేసిన తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై అందరికీ ఇందులోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. చెప్పినట్లుగానే డిసెంబర్ 8న ప్రజాదర్బాద్ నిర్వహించారు. సీఎం రేవంత్ స్వయంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.వారం తిరిగింది.. ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాభవన్‌ను ఇకపై ప్రజల కోసమే వినియోగిస్తారని అంతా భావించారు. కానీ, డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కొందరైతే సీఎం రేవంత్‌పై విమర్శలు మొదలు పెట్టారు.
లోపల ఇంద్రభవనమే
ఎన్నికలకు ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ గేట్లు బద్ధలు కొడతామని ప్రకటించారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రగతిభవన్ ముందు ఏర్పాటు చేసిన భారీ ఇనుప కంచెలు, ముళ్ల కంచెలను తొలగించారు. ఇప్పుడు ప్రజతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రమాణం చేసిన మరుసటి రోజే అందులో ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రస్తుతం వారంలో రెండుసార్లు(మంగళ, శుక్రవారాల్లో) ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా కూడా మార్చారు.ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఎక్కువగా భూ సమస్యలు, కబ్జాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అరాచకాలపై ఫిర్యాదలు ఇస్తున్నారు. ఇదే సమయంలో కళ్లు చెదిరే రీతిలో కేసీఆర్ నిర్మించుకున్న ప్రజాభవన్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా తమ సొమ్ముతో కట్టుటకుని రాజభోగాలు అనుభవించారని, తమకు మాత్రం ఇందులో అనుమతి లేకుండా చేశారని చర్చించుకుంటున్నారు. రేవంత్ రాకతో ప్రగతిభవన్‌లో అడుగు పెట్టే అవకాశం వచ్చిందంటున్నారు.బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు కూడా చాలా మంది ప్రగతి భవన్‌లోకి అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఇలాంటి వారు కూడా ప్రగతి భవన్‌కు వచ్చి చూసి వెళ్లొచ్చని కాంగ్రెస్ నేతుల ఆహ్వానిస్తున్నారు. ప్రగతి భవన్‌ను ఎలా గడీగా మార్చారో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.తాజాగా ప్రజాభవన్ గురించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమహల్‌కు ఏమాత్రం తీసిపోకుండా కేసీఆర్ ఈ భవనాన్ని ఇష్టంగా నిర్మిచంకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రాజ దర్పం తొణికిసలాడేలా కాస్ట్ లీ ఫర్నిచర్ తో సుందరమైన గదులు కనిపిస్తున్నాయి. విశాలమైన హాల్, అతిపెద్ద డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరిమిట్లు గొలిపే లైటింగ్ తో ప్రజా భవన్ ఇంద్ర భవనాన్ని తలపిస్తోందని ఈ వీడియోలను చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ తాను నివసించడం కోసం ఇంత ఖరీదైన భవనాన్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్నారని, ఇదంతా ప్రజల సొమ్మే గా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.