సిరా న్యూస్,కడప;
ఆహ్లాదకరమైన వాతావరణం, సౌకర్యవంతమైన మౌలిక వసతులు, పర్యాటక సొగబులు, ఉన్నతమైన విద్యా అవకాశాలు, మెరుగైన వైద్య సౌకర్యాలు ఇలాంటివన్నీ కల్పించి నగరానికి ఓ ప్రత్యేక తీసుకొచ్చి, ఇదీ మన కడప అని గర్వంగా చెప్పుకొనే విధంగా తీర్చిదిద్దుతున్నామని నగర మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు పేర్కొన్నారు. 54 నెలల్లో 2,125 కోట్ల రూపాయలతో కడప నగరంలో సుందరీకరణ, అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని తెలిపారు. వీటిలో కొన్ని టెండర్ల దశలోనూ, మరికొన్ని పురోగతిలోనూ ఉన్నాయని వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే కడప ఆదర్శవంతమైన నగరమవుతుందన్నారు.సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన 54 నెలల్లో కడప కార్పోరేషన్ లో రూ.2125 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నగరానికి శాశ్వత నీటి పథకం కోసం తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ నుంచి 1.5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి రూ.510 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. బుగ్గవంక ఆధునికీకరణ పనులు పూర్తి కావచ్చాయని, రోడ్ల విస్తరణ, నూతన సర్కిల్స్ నిర్మాణ పనులు చేపట్టామని, వీటిలో కొన్నింటిని ఈ నెలాఖరులో కడప నగర పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని నగర మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు పేర్కొన్నారు.2019 డిసెంబరు 23న సీఎం జగన్ రోడ్ల విస్తరణ, సర్కిల్స్, ఆసుపత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారన్నారు. 2020 మార్చిలో కరోనా మహమ్మారితో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని తెలిపారు. మళ్లీ 2022లో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. నగరాలు అబివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఇండస్ట్రియల్, టూరిజం అభివృద్ధి చెందాలన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన రిమ్స్ లో దాదాపుగా రూ.280 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, క్యాన్సర్ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెలాఖరుకు కడప నగర పర్యటనలో సీఎం వీటిని ప్రారంభిస్తారని వెల్లడించారు. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పరిశ్రమలు వస్తుండడంతో ఉపాధి కోసం స్థానికులకు దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. యోగివేమన యూనివర్శిటీ, జెఎన్టీయూ మెడికల్, డెంటల్ కళాశాలలు ఉన్నాయని, టూరిజం పరంగానూ అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు.హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో కడప చెరువు సుందరీకరణ పనులకు రూ.63.40 కోట్లతో టెండర్లు పిలిచామని, వచ్చే నెల నుంచి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రూ.140 కోట్లతో రహదారుల విస్తరణ, నూతన సర్కిల్స్ నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. రోడ్ల వెడల్పు కోసం భూసేకరణ, కట్టడాల కూల్చివేతలో బాధితులకు రూ.85.89 కోట్ల నష్ట పరిహారం చెల్లించామన్నారు. పుట్లంపల్లి ట్యాంక్ బండ్, ఇతర చెరువుల అభివృద్ధి కొరకు రూ.15 కోట్లతో చేపట్టిన పనుల్లో రూ.10 కోట్ల పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన రూ.5 కోట్ల పనులకు టెండర్లు నిర్వహించాల్సి వుందన్నారు. కడప నగరంలో అతి సుందరంగా రూ.9 కోట్లతో రాజీవ్ మార్గ్, పార్క్ ను ఆథునీకరించి ప్రారంభించామన్నారు. రూ.100 కోట్లతో నగరంలోని బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టామని, ఇరువైపులా 40 అడుగుల రోడ్ల నిర్మాణాలు పూర్తి కావచ్చయని వెల్లడించారు.నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో రూ.45.50 కోట్లతో సీపీ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.69 కోట్లతో.20 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు.