ఎమ్మెల్యే జోగు తీరు వల్లే బిఆర్ఎస్ పార్టీని వీడాను : బాలూరి గోవర్ధన్ రెడ్డి
సిరా న్యూస్ (ఆదిలాబాద్ బ్యూరో): ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తీరుతోనే తాను బీఆర్‌ఎస్ పార్టీని వీడినట్లు బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఎమ్మెల్యే జోగు రామన్న కంటే ముందే బీఆర్‌ఎస్‌లో చేరానని, తన తరువాత ఎమ్మెల్యే జోగు రామన్న పార్టీలోకి చేరారని అన్నారు. అప్పటి నుంచి తనపై వివక్ష చూపిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తనను రాజకీయంగా ఎదగనీయకుండా అణగదొక్కారని వాపోయారు.ఏండ్లుగా బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న తనకు ఎమ్మెల్యే జోగు రామన్న పదవులు ఇస్తానని చెప్పి మోసం చేసారని అన్నారు. మున్సిపల్ చైర్మెన్, గ్రంథాలయ చైర్మెన్, మార్కెట్ కమిటీ చైర్మెన్, డీసీసీబీ చైర్మెన్ పదవులు రానీయకుండా అడ్డుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే జోగు రామ్నన తన కొడుకుల భవిష్యత్తు కోసం నా రాజకీయ భవిషత్తును పణంగా పెట్టారని ఆయన అన్నారు. డీసీసీబీ చైర్మెన్ పదవి తనకు ఇచ్చేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ ఒప్పుకున్నప్పటికీ, ఎమ్మెల్యే జోగు రామన్న వారించడంతోనే తనకు పదవి దక్కలేదని విమర్శించారు. మంత్రి కేటీఆర్ ఇటీవలే ఫోన్ చేసి, ఎమ్మెల్యే జోగు రామనన ఒత్తిడితోనే తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని స్పష్టం చేసారు. ఈ పరిణామాలతో తాను ఎంతగానే ఆవేదన చెందానని, అందుకే రేవంత్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రేస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన స్పష్టం చేసారు.