సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి సంస్థ రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు స్థానిక జి.యం. కార్యాలయ ఆవరణలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు* ముఖ్య అథితులుగా హాజరై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొనడమే కాకుండా, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో కూడా చురుకుగా పాల్గొన్నారన్నారు. 1952 సంవత్సరంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా ఎన్నికై, 1971 వరకు కొనసాగారని అన్నారు. వారు నిఖార్సయిన తెలంగాణ వాది అని, అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలివేసిన నిబద్ధత గల రాజకీయ వేత్త అని కొనియాడారు. రాష్ట్ర చేనేత రంగ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆ గొప్ప నాయకుడి జీవితాన్ని మనమందరం స్పూర్తిగా తీసుకొని సంస్థ అభివృద్ధితో పాటు, తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం.రామచంద్ర రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, ఫైనాన్స్ ఎజిఎం పి.శ్రీనివాసులు, ఎస్వోటుజిఎం బి.సత్యనారాయణ, అధికారులు పి.రాజారెడ్డి, పి.డి.సుధాకర్, డి.జనార్ధన రెడ్డి, కె.ఐలయ్య, గుర్రం శ్రీహరి, రాజేంద్రప్రసాద్, రాజేశ్వరి, విభాగాధిపతులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.