రాజీవ్ రహదారిలో స్పీడ్ లేజర్ గన్

సిరా న్యూస్,సిద్దిపేట;
రాజీవ్ రహదారి కరీంనగర్ రోడ్డు అతివేగంగా వెళుతున్న వాహనాలను సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ స్పీడ్ లేజర్ గన్ తో పరిశీలించారు. అధిక వేగం ఎప్పటికైనా ప్రమాదకరం. మనిషి ప్రాణం విలువ తెలుసుకొని వాహనాలు నడపాలి. పండుగ రోజులలో కుటుంబానికి విషాదం మిగిల్చవద్దని అయన అన్నారు.
ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు అధిక వేగంతో వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని, ప్రమాదాల నివారణ గురించి పోలీసులు తెలుసుకుంటున్న చర్యలకు వాహనదారులు సహకరించాలని సూచించారు. రాజీవ్ రహదారి కరీంనగర్ రోడ్ ఇబ్రహీం నగర్ గ్రామ శివారులో స్పీడ్ లేజర్ గన్ ద్వారా వేగంగా వెళుతున్న వాహనాలను పరిశీలించి ఓవర్ స్పీడ్ అధిక వేగం 90 కంటే ఎక్కువ వేగంగా వెళ్లే వాహనాలపై 100 కేసులు నమోదు చేయడం జరిగింది. అతివేగం ఎప్పటికీ ప్రమాదకరమని 80 లో వెళ్లే వాహనానికి 100 స్పీడ్ తో వెళ్లే వాహనానికి పెద్ద తేడా ఉండదని 10 నుంచి 15 నిమిషాలు తేడా మాత్రమే ఉంటుందని ఈ విషయం వాహనదారులు గమనించి అధిక వేగంగా వాహనాలు నడపవద్దని సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదానికి గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రాణం విలువ తెలుసుకొని వాహనాలు నడపాలని సూచించారు. వేగంగా వెళితే మీకు ప్రమాదం, మరియు ఎదురుగా వచ్చే వాహనదారులకు కూడా ప్రమాదం, వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. దసరా బతుకమ్మ పండుగ ఉన్నందున కుటుంబ సభ్యులతో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. నాలుగు చక్రాల వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అధిక వేగంగా వాహనాలు నడిపే వారిపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రమాదాల నివారణ గురించి మాత్రమే స్పీడ్ లేజర్ గన్ తో కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పీడ్ లేజర్ గన్ ఆపరేటర్ జగదీశ్వర్ కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *