సిరా న్యూస్,అవనిగడ్డ;
అవనిగడ్డ నియోజకవర్గం గుల్లలమోద గ్రామంలో క్షిపణి పరీక్షా కేంద్రం అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని హై లెవెల్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలపడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ లోని బుద్ధప్రసాద్ స్వగృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుల్లలమోద క్షిపణి పరీక్షా కేంద్రం మంజూరు చేయడం ద్వారా అవనిగడ్డ నియోజకవర్గానికి కేంద్రం మహత్తర ప్రాజెక్టును ఇచ్చిందని అన్నారు. రాకెట్ ప్రయోగాలకు అనువైన ప్రాంతంగా గుల్లలమోద గ్రామాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మించనున్నారని అన్నారు. దీనికి సహకరించిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి, డిఆర్డీవో పూర్వపు చైర్మన్ సతీష్ రెడ్డి లకు బుద్ధప్రసాద్ ధన్యవాదములు తెలిపారు.