గిరిజనులు, ఆదివాసీలపై సీఎం జగన్‌ది కపట ప్రేమ

గిరిజన ప్రాంతాలను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు
మాజీ మంత్రి కిడారి శ్రావణ్

సిరా న్యూస్,విశాఖపట్టణం ;
గిరిజనులు, ఆదివాసీలపై సీఎం జగన్‌ది కపట ప్రేమని, గిరిజన ప్రాంతాలను సర్వనాశనం చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని టీడీపీ అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ విమర్శించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బాక్సైట్‌ని బడా కంపెనీలకు ఎలా ఇవ్వాలని సర్వే కోసం జగన్ వచ్చినట్లు ఉందని, గిరిజన ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయని వాటిపై స్పందించకుండా బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారని ఆరోపించారు.గిరిజన ప్రాంతాలను, చట్టాలను నిర్వీర్యం చేశారని, ఒక్క రూపాయి కూడా గిరిజనులకు రుణం ఇవ్వలేదని, గిరిజనులకు 16 పథకాలను రద్దు చేశారని కిడారి శ్రావణ్ విమర్శించారు. గిరిజన ప్రాంతాల ప్రజలు వైసీపీని నమ్మేటటువంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన అనంతబాబును సీఎం జగన్ తన పక్కనే ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో పుట్టినరోజునాడు వచ్చి కనీసం గిరిజన సమస్యలపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.2014 నుంచి 2019 వరకు ఖర్చుపెట్టినటువంటి సబ్ ప్లాన్ నిధులు చంద్రబాబు హయాంలో ఏరకంగా ఖర్చుపెట్టామో తాము చెప్పగలమని, వైసీపీ హయాంలో ఆ నిధులు ఏమయ్యాయో ఓపెన్ డిబేట్‌కు రాగలరా?…శ్వేత పత్రం విడుదల చేయగలరా?.. అని కిడారి శ్రావణ్ సవాల్ చేశారు. బాక్సైట్ తవ్వకాల్ని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ 97 రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుదేనని, కానీ జగన్ పాలనలో అక్రమ మైనింగ్ ఏజెన్సీలోనే జరుగుతోందని, లేటారైట్ మైనింగ్ విచ్చల విడిగా సాగుతోందని ఆరోపించారు. స్ధానిక గిరిజనులకే ఉద్యోగాలు నూటికి నూరుశాతం ఇవ్వాలన్న జీవో నెం3ను రద్దు చేశారన్నారు. జీవో నెం.3కు చట్టబద్దత కల్పించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని కిడారి శ్రావణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *