సిరా న్యూస్,బెంగళూరు;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ బెంగళూరుపై తీవ్రంగా పడింది. నిన్న సాయంత్రం మొదలైన వర్షం ఇవాళ తెల్లవారుజాము వరకు పడింది. దీంతో నగరం రాత్రికి రాత్రే అతలాకుతలమైంది. రహదారులు వాగుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది కాలనీలు నీట మునిగాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు రూరల్ జిల్లా లో భారీ వర్షం పడింది. ఇక్కడ 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గొట్టిగెరె, చౌడేశ్వరి, యలహంక న్యూ టౌన్ లాంటి ప్రాంతాలు వరద బీభత్సానికి అల్లాడిపోతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. బాధితులను పడవల సాయంతో బయటకు తీసుకొస్తున్నారు.మూడు రోజులుగా బెంగళూరులో వానలు పడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా మోకాలి లోతు నీరు కనిపిస్తోంది. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉత్తర బెంగళూరులోని దొడ్డబొమ్మసండ్ర సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ సరస్సు ఉప్పొంగడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి. హెబ్బాల్ లోని టాటా నగర్ నీటి మునిగింది. మోకాలి లోతు నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూ సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తారునీరు సరఫరా చేస్తున్నారు.బీబీఎంసీ(బృహత్ బెంగళూరు మహానగర పాలికె) నివేదిక ప్రకారం.. యలహంకలో కేవలం 6 గంటల వ్యవధిలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యలహంకలో వెయ్యికి పైగా ఇళ్లు నీట మునిగాయి. అధికారులు మరింత వరద నీరు అక్కడికి వచ్చి చేరకుండా చర్యలు చేపట్టారు. కుండపోత వాన కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బెంగళూరు నగరంలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించింది.