పేదోల్ల జోలికి వస్తే ఊరుకోం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సిరా న్యూస్,హైదరాబాద్;
మూసీ బాధితులకు అండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలకు నిరసనగా బీజేపీ చేపట్టిన మహాధర్నా లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి కావస్తుందన్నారు. ఈ సమయంలో ఏ ఒక్క ఇంటికి భూమిపూజ, శంకుస్థాపన చేయలేదన్నారు.సోనియా, రాహుల్ ల నాయకత్వంలో ఒక్క పేదవారి ఇంటికి శంకుస్థాపన చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి ఇటుకమీద ఇటుకపేర్చి నిర్మాణం చేసుకున్న పేదల గూళ్లను కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రాంతానికి వెళితే వారి కష్టాలు విని కడుపు తరుక్కుపోతుందన్నారు.
గత రెండు నెలలుగా ఆ నిరుపేదలందరికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కడుపు నిండా కూడా తినలేని పరిస్థితులో ఉన్నారని అన్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు.వీరందరికీ బీజేపీ అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో, నగరంలో పేదవాడికి ఇబ్బంది వస్తే, మోదీ ఆదేశాలతో అండగా నిలబడతామని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఇళ్లు కట్టిస్తాం, మహిళలకు రూ. 2500, రైతులకు రుణమాఫి, రైతు కూలీలకు 12వేలు, పెన్షన్ లు పెంచుతాం, నిరుద్యోగులకు భృతి, రైతులకు సబ్సిడీ లాంటి అనేక రకాల హామీలను ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆరుగ్యారంటీల పేరుతో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డిలు ప్రజలను మభ్యపెట్టి గ్యారంటీలను గారడీలుగా మార్చి మసిబూసి మారెడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాకుండాఅడ్డుకున్నదో, తెలంగాణ ఉద్యమంలో 1500మంది బలిదానాలు చేసుకున్నారో అదే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉందో చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వం కూడా ఇలాగే బీఆర్ ఎస్ మూసీ ప్రజలను భయపెట్టిందన్నారు. అప్పుడు కూడా బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల ఇళ్లను రక్షించామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు. స్థానిక ఎంపీలు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నారని అన్నారు. మూసీ పారివాహాక ప్రాంతంలోని బాధితులందరినీ స్వయంగా వారిని కలిసి వారి ఆవేదన, ఆక్రోశం, కష్టాలు, కన్నీళ్లను చూశామన్నారు. మూసీ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు వ్యతిరేకం కాదన్నారు. కానీ పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే బీజేపీ అడ్డుకుంటుందన్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి సుందరీకరణ చేపట్టాలన్నారు. పేద ప్రజలు ఆ వాసనలోనే ఉండాలని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.