జిల్లా ఇంఛార్జి కలెక్టర్ అదితి సింగ్, ఎమ్మెల్యే మాధవీ రెడ్డి
అక్టోబర్ 25 నుండి ఫిబ్రవరి 28 వరకు సర్వే
సిరా న్యూస్,బద్వేలు ఉదయం ప్రతినిధి;
కడప జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న 21వ పశు గణన సర్వేని పక్కాగా నిర్వహించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ అదితి సింగ్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిలు వేర్వేరు కార్యక్రమాల్లో పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో డిఆర్వో గంగాధర్ గౌడ్, డిపివో రాజ్యలక్ష్మి, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. శారదమ్మ, నోడల్ అధికారి డా. ప్రమోద్ కుమార్ రెడ్డి, పశు వైద్యాధికారి డా.అనుపమ లతో కలిసి 21వ పశు గణన సర్వేకి సంబంధించిన ప్రచార పోస్టర్లను, స్టిక్కర్లను జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆవిష్కరించారు.
అలాగే.. కడప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి సంబంధిత అధికారులతో 21వ పశుగణన సర్వేకి సంబందించిన పోస్టర్లను, స్టిక్కర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పశు సంపద అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రధాన్యమైనదని ఈ గణన ద్వారా జిల్లాలో పశుసంపదను అంచనా వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆవులు, గేదలు, మేకలు, గొర్రెలు, కోళ్లు మొదలైన పశు సంపద మన రైతులకు జీవనోపాధినిచ్చే వనరులు మాత్రమే కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి అన్నారు. పాడిపశు రంగం మన దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) లో దాదాపు 4.11% వాటాను, వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో 29.35% వాటాను కలిగి ఉందన్నారు. ఈ రంగం దేశ వ్యాప్తంగా 8.8% గ్రామీణ కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంతటి ప్రాముఖ్యతను పోషిస్తున్న పశు సంపదను సరిగ్గా లెక్క వేసుకోలేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడే అవకాశం ఉందన్నారు. అందుకే.. ప్రతీ ఒక్కరు పశుగణన సర్వేని పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా.. ఇంటింటి సర్వేకి వచ్చే అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను అందించాలని ఈ సందర్బంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు.