దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి
పాలిథిన్ సంచుల్లో పత్తిని తేవద్దని, యూత్ జ్యుట్ సంచుల్లో పత్తిని తీసుకోవాలని విజ్ఞప్తి.
సిరా న్యూస్,మైలవరం;
రైతులు పత్తి పంటను సీసీఐ కోనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. మైలవరంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని అయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో పత్తి దిగుబడులు, గిట్టుబాటు ధర, సీసీఐ నిబంధనల గురించి మాట్లాడారు. రైతులు విక్రయించడానికి తీసుకువచ్చిన పత్తిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికి క్వింటాకు ఒక్కింటికి రూ.7,521 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. 8 శాతం తేమ ఉన్నప్పుడే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. తేమ శాతం పెరిగితే మద్దతు ధర తగ్గుతుందన్నారు. 9 శాతానికి రూ.7,445.79లు, పది శాతానికి రూ.7,370.58లు, 11 శాతానికి రూ.7,295.37లు, 12 శాతానికి రూ.7,220.16లు చెల్లిస్తారని పేర్కొన్నారు. రైతులు పత్తిని పాలిథిన్ సంచుల్లో తీసుకురావద్దని, పత్తిని జ్యుట్ సంచుల్లో లేదా విడిగా మాత్రమే తీసుకురావాలని సూచించారు. పాలిథిన్ సంచుల్లో పత్తిని నింపి రవాణా చేయడం వల్ల, పాలిథిన్ పత్తిలో జిన్నింగ్ అయ్యి నాణ్యత తగ్గుతుందన్నారు. దీనివల్ల నష్టం జరుగుతుందన్నారు. కాబట్టి రైతులు పత్తి రవాణాకు పాలిథిన్ సంచులు వాడవద్దని సూచించారు.