క్రీడలతో పాటు విద్యలో కూడా విద్యార్థులు రాణించాలి

-రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మంథని గురుకుల విద్యార్థులు
విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్ శ్రీనాథ్

సిరా న్యూస్,మంథని;
క్రీడలతో పాటు విద్యలో కూడా విద్యార్థులు రాణించాలని గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్ అన్నారు. మంథని గురుకుల పాఠశాల విద్యార్థులు అసాధారమైన ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కాలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న క్రీడా పోటీలలో మంథని పట్టణానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల (బాలురు) అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ బహుమతులు కైవసం చేసుకోవడమే కాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం వీరిని ప్రిన్సిపల్ శ్రీనాథ్ ప్రత్యేకంగా అభినందించి, బహుమతులను అందజేశారు. అండర్-19 కబడ్డీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభిరామ్, పదో తరగతి చదువుతున్న కార్తీక్, ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వరుణ్, అండర్ 14 ఖో ఖో విభాగంలో ఎనిమిదో తరగతి చదువుతున్న శివ కిషోర్, శివ చరణ్ తేజ, అథ్లెటిక్స్ విభాగంలో ఇంటర్మీడియట్ బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఖో ఖో విభాగంలో పాఠశాల ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, బహుమతులు సాధించిన విద్యార్థులను, పిడి రమేష్, పిఈటి పుష్పలతలను ప్రిన్సిపాల్ శ్రీనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనాథ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉంటుందని ఆయన వివరించారు. క్రీడల వల్ల మానసిక ఆనందం కలుగుతుందని, ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఏదో ఒక క్రీడలో ఆరితేరాలని ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కళాశాల/పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *