సిరాన్యూస్,కాల్వశ్రీరాంపూర్
సర్వేకు ప్రజలు సహకరించాలి : కలెక్టర్ కోయ శ్రీ హర్ష
లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులు కృషి చేయాలి
నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన మద్దతు ధరపై కొనుగోలు చేయాలి
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజలు పాల్గొని వివరాలు అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు. బుధవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష విస్తృతంగా పర్యటించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గంగారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, శ్రీరాంపూర్ మండల హెడ్ క్వార్టర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, శ్రీరాంపూర్ లో నిర్మాణం అవుతున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులను కలెక్టర్ పరిశీలించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో జరుగుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. నవంబర్ 6 నుంచి 8 వరకు హౌస్ లిస్టింగ్ పూర్తి చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించాలని అన్నారు. ఏ ఇండ్లు మిస్ కాకుండా సమగ్ర సర్వే నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వల్ల మరిన్ని సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికల రూపకల్పన కోసం మాత్రమే ఈ సర్వే చేపడుతున్నామని, ఎటువంటి అపోహలు లేకుండా ప్రజలు పూర్తి వివరాలు అధికారులకు అందించి సహకరించాలని కలెక్టర్ కోరారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేస్తూ , నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు వచ్చిన వెంటనే ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ధాన్యం తేమ శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వివరాలు రికార్డులలో నమోదు చేయాలని అన్నారు. మద్దతు ధర పై నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎటువంటి ఆలస్యం జరగడానికి వీలులేదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల దృష్ట్యా పంట నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల పర్యటన సందర్భంగా విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటిస్తూ పాఠశాలలో బోధన విధానం, సమస్యలు ఏమైనా ఉన్నాయా, పాఠశాల లో ఇంకా కావాల్సిన వసతులు, పిల్లలు పెద్ద అయ్యాక ఏం అవ్వాలి అనుకుంటున్నారు, జీవిత ఆశయం మొదలగు వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా మన ప్రయాణం ఇప్పటి నుంచే ప్రారంభించాలని, లక్ష్యాలను చేరుకునేందుకు మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువు, ఆటలలో ముందు ఉండాలని అన్నారు. ప్రతి రోజు కొంత నిర్దిష్ట సమయాన్ని ఇంటి వద్ద చదువు కోసం, ఆటలు ఆడేందుకు కేటాయించి దాని ప్రకారం నడుచుకోవాలని అన్నారు. విద్యార్థులు వారి ఆరోగ్యం ,ఎదుగుదల పట్ల కూడా శ్రద్ధ వహించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్ తినే అలవాట్లు తగ్గించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలు జిల్లా కలెక్టర్ వెంట డి.సి.ఓ.శ్రీ మాల తహసీల్దార్ వకిల్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.