సిరా న్యూస్,మహబూబ్ నగర్;
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవాలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. మహబూబ్నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తిలో కొలువైన వేంకటేశ్వరుడు.. కురుమూర్తి రాయుడిగా పూజలందుకుంటున్నారు. అయితే.. ఏడుకొండల మధ్యలో ఉన్న కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తి ఆలయానికి చేరుకునేందుకు సరైన రోడ్డు లేకపోవటంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కురుమూర్తి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు..రూ. 110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.ఆలయానికి ఘాటు రోడ్డు నిర్మాణ ఆవశ్యకతపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీసుకెళ్లారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలలో కురుమూర్తి జాతర కూడా ఒకటి. ప్రస్తుతం కురుమూర్తి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ.. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు పడుతుండటం గమనించిన ప్రభుత్వం.. ఘాట్ రోడ్డు నిర్మాణ ఆవశ్యకతను గుర్తించింది. ఈ మేరకు.. ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.34 లక్షల రూపాయల వ్యయంతో శాశ్వత తాగునీటి సౌకర్యాలను కల్పించడంతో పాటు ప్రస్తుతం రూ.11 0 కోట్లతో ఘాటు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయటంపై.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతుండడంతో భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దీపావళి సందర్భంగా.. అక్టోబర్ 31న కురుమూర్తి బ్రహ్మోత్సవాలు మొదలుకాగా.. నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కేవలం మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానున్నారు. సుమారు 4 లక్షల మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలల్లో పాల్గొననున్నట్టు అంచనా వేశారు.