రెండు రాష్ట్రాల్లో పులి భయం

సిరా న్యూస్,విజయనగరం;
ఒడిశా సరిహద్దులో పులి సంచారం చేస్తుండడంతో ఆంధ్రాలో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా గంజాం, గజపతి జిల్లాల్లో మహారాష్ట్ర నుంచి దారితప్పి వచ్చిన పులిని అక్కడ అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో బరంపురం సమీపాన జయంతి పురం వాసులు పులిని చూడడంతో ఆ ప్రాంత వాసుల్లో భయాందోళన నెలకొంది. అక్కడి ప్రజలు పులి ఎక్కడ వచ్చి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.కొన్ని రోజులుగా గంజాం, గజపతి జిల్లాల్లో ప్రజల్ని మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి భయం వెంటాడుతోంది. నవంబర్ 3న రాత్రి జాతీయ రహదారి దాటుతున్న పులి ఓ కారులో అమర్చిన కెమెరాకు చిక్కింది. ఆ ప్రాంతం గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని భలియాగడ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిగా దాటుతున్న పులి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఒడిశా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పొలాల్లో పులి పాద గుర్తుల్ని అటవీ సిబ్బంది గుర్తించారు. దీంతో భలియాగడ, పల్లి, ఝింకిపదర్, ఘాటీకాళువ తదితర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో మైకు ద్వారా ప్రచారం నిర్వహించి, ప్రజల్ని చైతన్యపరిచారు.పశువుల్ని మేతకు బయటకు వదలొద్దని, ప్రజలు సాయంత్రం నుంచి తెల్లవారే వరకు ఇళ్ల నుంచి బయటకు ఒంటరిగా రావద్దని వారు ప్రచారం నిర్వహించారు. మరోవైపు తన మేకను పులి చంపేసిందంటూ పొన్నాడ గ్రామానికి చెందిన సంబర మల్లిక్‌ వాపోయాడు. వరి కోతకు వచ్చిన సమయంలో రైతులు పంటల్ని అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు రాత్రుళ్లు పొలాల్లో కాపలా ఉంటుంటారని, పులి భయంతో వారెవరూ పొలాలకు వెళ్లడం లేదని కుఠారసింగి ప్రాంతవాసులు వాపోతున్నారు.మ్యాటింగ్ సమయం వలన మరింత జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు చెబుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సరిహద్దు వాసులను పలాస కాశీబుగ్గ రెంజ్ ఆఫీసరు మురళీ కృష్ణ అప్రమత్తం చేశారు. ఒడిశా బరంపురం ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున శ్రీకాకుళం జిల్లా వైపు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గట్టి నిఘా పెట్టామని, ప్రజలను అప్రమత్తం చేశామని మురళి కృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *