పదవుల భర్తీలో ఆలస్యంతో నైరాశ్యం

సిరా న్యూస్,హైదరాబాద్;
పదేళ్లు పోరాడం. పొద్దున లేస్తే రోడ్డు మీదే ఉన్నాం. ఇప్పుడు పార్టీ పవర్‌లోకి వచ్చింది న్యాయం జరుగుతుందని అనుకున్నాం. ఏడాది అవుతుంది. ఇప్పటివరకు ఓ గుర్తింపు లేదు. పదవి లేదు. అంటూ గునుక్కుంటున్నారట కాంగ్రెస్ నేతలు. ఇంకో నెల అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవులను కూడా మొత్తం భర్తీ చేయలేదు. ఇలా పదవుల భర్తీలో ఆలస్యం అవుతుండటంతో నేతల్లో నైరాశ్యం కనిపిస్తోందట. పార్టీ కోసం ఎంత మొత్తుకుని ఏం లాభం అంటూ నింటూర్పుతో ఉన్నారు కొందరు నేతలు.రోజులు గడుస్తున్నా పదవుల భర్తీకి సర్కారు పెద్దలు పచ్చజెండా ఊపకపోవడంతో లీడర్లు ఢీలా పడుతున్నారు. పూర్తిస్థాయి క్యాబినెట్‌ విస్తరణపై చాలాసార్లు కసరత్తు చేసినా..ముందడుగు పడటం లేదు. సీఎంతో సహా 11మంది మంత్రులతోనే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తోంది. మిగతా ఆరు బెర్తుల కోసం తక్కువలో తక్కువ 20మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అందుకోసం సీఎం రేవంత్‌తో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా పైరవీలు చేస్తున్నారట. అయితే అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు. నేతల అమాత్య ఆశలు నెరవేరడం లేదు. క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను భర్తీ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా ప్రాతినిధ్యంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేసుకుంటున్నారు. ఇవేవీ కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం వాయిదా వేస్తూ వస్తోందిఇక కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవుల భర్తీది అదే పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటించి ఆ తర్వాత మూడు నెలలకు గానీ జీవోలు ఇవ్వలేదు. ఇప్పటికీ ఇంకా 40 శాతం ఛైర్మన్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారా అని నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో..కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా ఇస్తారా లేకపోతే తమ సంగతి ఇంతేనా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట నేతలు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కోసం చాలామంది నేతలు గాంధీభవన్‌తో పాటు సీఎం, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారుఎవరి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నేతలంతా నీరసించి పోతున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్లకు క్యాబినెట్ విస్తరణకు ముడిపడి ఉండటంతో.. వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలది అదే పరిస్థితి. ఇప్పటివరకు సగం మార్కెట్లకే కమిటీలు వేశారు. మిగతావి అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా ఇంకా చాలా పోస్ట్‌ల భర్తీని పెండింగ్‌లోనే ఉంచారు ప్రభుత్వ పెద్దలు. పదవులు భర్తీ చేయకపోవడంతో పార్టీ కోసం పనిచేసిన నేతలు..సీట్లు త్యాగం చేసినవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తమకు మొండి చెయ్యి చూపిస్తున్నారని పార్టీ నేతలతో పాటు, ద్వితీయ శ్రేణి లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా పదవుల భర్తీకి ఆలస్యం ఎందుకు అవుతుందో కనీసం సీనియర్లు అయినా క్లారిటీ ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే పార్టీ కోసం పనిచేయడం ఎలా అని ప్రశ్నిస్తున్నారట. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేయాలంటే పదవులు ఇవ్వాలంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవి లేకుండా పని చేయమనడం ఎంతవరకు సాధ్యం అవుతుందని పీసీసీ పెద్దలను నిలదీస్తున్నారట పార్టీ నేతలు.పదవుల కోసం నేతల పైరవీలు ఎలా ఉన్నా..ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ఇంకా ఆలస్యం అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అట్లైనా ఇంకో రెండు మూడు నెలలు అయితే వెయిట్ చేయక తప్పదు. దీంతో ఆశావహులను, ద్వితీయ శ్రేణి నేతలను సముదాయించడం ఎలా అని ఆలోచిస్తున్నారట పార్టీ పెద్దలు. హైకమాండ్ డెసిషన్ అంటూ దాటవేస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *