సచివాలయ సేవలు వర్సెస్ మీ సేవలు

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ఒరిగిన మేలేమిటో కానీ చిక్కులు మాత్రం తప్పడం లేదు. గడప వద్దకే సుపరిపాలన నినాదంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో పౌర సేవల్లో జవాబుదారీతనం తీసుకు రాకుండానే ఐదేళ్లు గడిపేశారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ మినహా సచివాలయాలతో సాధించిన సాధికారత ఏమిటో నిర్దిష్టంగా చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది.ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడిచిపోయాయి. గ్రామ, వార్డు సచివాలయాలను పునర్వ్యస్థీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందులో కూడా తాత్సారం కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి నెల మొదటి తేదీల్లో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ మినహా లక్షా 34వేల సచివాలయ సిబ్బంది ఏ పని లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో దాదాపు 23రకాల డిబిటి పథకాలు, నాన్ డిబిటి పథకాలతో ఏటా క్యాలెండర్‌ ప్రకారం సచివాలయ సిబ్బందికి ఎంతో కొంత పని ఉండేది. ప్రస్తుతం పెన్షన్లు మినహా మిగిలిన పథకాలు నిలిచిపోవడంతో కొన్ని నెలలుగా కార్యాలయాలకు వచ్చి వెళ్లడం మినహా సచివాలయ సిబ్బందికి ఏ పని లేకుండానే గడిచి పోతోంది.వైసీపీ ప్రభుత్వం హడావుడిగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్కో సచివాలయానికి సగటున ఎనిమిది సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల పైచిలుకు సచివాలయాలు ఉన్నాయి. దశల వారీగా 500కుపైగా పౌరసేవల్ని సచివాలయాల్లో అందిస్తామని జగన్ ప్రభుత్వం పదేపదే చెప్పుకున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు.ప్రజలకు క్షేత్ర స్థాయిలో పౌరసేవల్ని అందించే రెవిన్యూ, వ్యవసాయం, సివిల్‌ సప్లైస్‌, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్‌ వంటి మాతృశా‌‌ఖల ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించేందుకు సచివాలయాలను ఏర్పాటు చేశారు. అయితే అయా శాఖల నుంచి అధికారాలను మాత్రం సచివాలయాలకు బదలాయించలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలకు మధ్య మరో సమాంతర ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. సాంకేతికంగా చెప్పాలంటే సచివాలయ సిబ్బందికి ఎలాంటి అధికారాలు లేవు. కేవలం దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయడానికి మాత్రమే వారు పరిమితం అయ్యారు. దానినే గ్రామ స్వరాజ్యంగా ప్రచారం చేసుకున్నారు.గ్రామ, వార్డు సచివాలయాల రాకతో అంతకు ముందు ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు మరుగున పడిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు పౌరసేవల కోసం ప్రభుత్వ కార్యలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌, టీసీఎస్‌ భాగస్వామ్యంలో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు మొదటి సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలోనే దశల వారీగా మీ సేవా కేంద్రాల్లో టెక్నాలజీ ఆధారిత పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి.2019లో గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యాక మీసేవా కేంద్రాల అవసరం తగ్గిపోయింది. దీంతో మీ సేవా కేంద్రాలు హైకోర్టును ఆశ్రయించడంతో వారిని కొనసాగించాలని ఆదేశించడంతో కొన్ని చోట్ల అవి కొనసాగుతున్నాయి.సచివాలయాల్లో పౌర సేవలు, ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చిన ప్రభుత్వం ప్రకటించింది. వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసినా ఇళ్ల వద్దకే ధృవీకరణ అందిస్తారని చెప్పుకున్నారు. మీ సేవా కేంద్రాల్లో ఇదే రకమైన సేవలు అందేవి. గతంలో 2014-19 వరకు దాదాపు 350రకాల సేవల్ని మీ సేవా కేంద్రాల్లో అందించేవారు.రెవిన్యూ ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్‌, ఇన్‌‌కమ్‌, సమీకృత ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే స్థానిక ఎమ్మార్వో కార్యాలయాలలో అమోదించిన తర్వాత వాటిని తిరిగి మీసేవా కేంద్రాల్లో ముద్రించి ఇచ్చేవారు.స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించి ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌, ఆస్తులకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు, ఆస్తులు, వ్యవసాయ భూముల కొనుగోళ్లలో మ్యుటేషన్‌ పత్రాలను కూడా మీ సేవా కేంద్రాల్లోనే చేసేవారు. ప్రస్తుతం ఈ తరహా సేవలన్ని రద్దు చేశారు. ఆస్తి కొనుగోళ్లలో ఈసీలు కావాలంటే సంబంధిత ఆస్తి నమోదైన రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రంలో ఎక్కడి ఆస్తులకు ఎక్కడైనా ఈసీలు పొందే వెసులుబాటు ఉండేది. సచివాలయాల రాకతో అవన్నీ మాయం అయ్యాయి.మీసేవల్లో రద్దైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందిస్తున్నారా అంటే అది కూడా లేదు. సచివాలయ సిబ్బంది తాము ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ప్రజల నుంచి అర్జీలను తీసుకుని వాటిని ఆన్‌లైన్‌ నమోదు చేయడం నమోషీగా భావిస్తున్నారు. దీంతో ప్రజలు తిరిగి మీ సేవా కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన ఉద్యోగాలు, విధులపై జాబ్‌ ఛార్ట్‌ను ఖరారు చేయకపోవడమే ఈ రకమైన సమస్యకు కారణం అవుతోంది. మహిళా పోలీసు వంటి ఉద్యోగాల్లో ఉన్నవారు విధులు, వారు ఏ పని చేస్తున్నారనే దానిపై కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. పేరుకు పోలీస్ అయినా వారిని యూనిఫాం సిబ్బంది సేవల పరిధిలో చేర్చే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఇంకా తొలగలేదు.పౌరసేవల్ని అందించే విషయంలో సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం వచ్చేసినట్టేనని గతంలో విస్తృత ప్రచారం చేసుకున్నారు. లైన్‌ డిపార్ట్‌మెంట్ల‌తో సచివాలయ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో ప్రజలు దరఖాస్తు చేయడం మొదలుకుని వాటిని పరిష్కరించుకోవడం వరకు అయా శాఖలనే ఆశ్రయించాల్సి వస్తోంది.ఇక సచివాలయాల్లో జారీ చేసే ధృవీకరణ పత్రాల విషయంలో మరో సాంకేతిక సమస్య ఎదురవుతోంది. మీ సేవా కేంద్రాల్లో నిర్ణీత రుసుము చెల్లిస్తే ఎన్ని కాపీలైనా ప్రింట్ చేసే అవకాశం ఉంటుంది. సచివాలయాల్లో ప్రస్తుతం డిజిటల్ కాపీలను మాత్రమే జారీ చేస్తున్నారు. క్యాస్ట్, ఇన్‌కమ్‌, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ వంటి వాటికి ఒక్క కాపీ మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఆస్తి పంపకాల్లో కీలకం. ఒకటి కంటే ఎక్కువ పత్రాలను మంజూరు చేయకుండా పిడిఎఫ్‌ కాపీలను మాత్రమే సచివాలయాల్లో జారీ చేస్తున్నారు.సచివాలయాల్లో జారీ చేసే డిజిటల్ కాపీలను మీ సేవా కేంద్రాల్లో ప్రింట్ చేసుకోవాలని ఉద్యోగులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. పిడిఎఫ్‌ కాపీలకు ఎవరైనా నకిలీ పత్రాలను సృష్టిస్తే తాము చిక్కుల్లో పడతామని, సచివాలయాలు జారీ చేసే పత్రాలను ముద్రించడానికి మీ సేవా కేంద్రాలు నిరాకరిస్తున్నాయి. సచివాలయాలు, మీ సేవా కేంద్రాల మధ్య నెలకొన్న గందరగోళంతో జనానికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.
===================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *