డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
సిరా న్యూస్,చిత్తూరు;
కుప్పం నియోజకవర్గంలో రైతులపై దాడి ఘటనపై రాష్ట్ర డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖరాసారు. రైతులపై దాడి చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ గూండాల దాడుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు వంటి బలహీన వర్గాలు టార్గెట్ అవుతున్నారు. గుడుపల్లె మండలం చీకాటిపల్లి పంచాయతీ వెంకటాపురంలో అధికార వైఎస్సార్సీపీ గూండాలు అమాయక రైతులపై దాడి చేశారు. వైసీపీ నేతల గూండా చర్యల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు తరుచూ తలెత్తుతున్నాయి. వైసీపీ గూండాలు రైతులపై నిన్న సాయంత్రం 5 గంటలకు దాడి చేస్తే ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. వైఎస్సార్సీపీ జడ్పీటీసీ కృష్ణమూర్తి బాధితుల పట్టా భూమిలో అక్రమంగా రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించారు. తమ భూమి గుండా రోడ్డు వేయడాన్ని రైతులు, భూ యజమానులు వ్యతిరేకించారు. జెడ్పీటీసీ కృష్ణమూర్తి అనుచరులతో కలిసి చేసిన దాడిలో గాయపడిన రైతులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నష్టపరిహారం కూడా అందించాలని అయన లేఖలోపేర్కోన్నారు.