సిరా న్యూస్,రాజమండ్రి;
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జంపింగ్ లు ఎక్కువవుతున్నాయి. టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు.. కూటమి గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్న లీడర్లు తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో పడ్డారు. అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జగ్గంపేట్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 6వ తేదీన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి మరికొందరు నేతలు కూడా తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అయి పోయారు. జనసేనలోకి కొందరు, టీడీపీలోకి మరికొందరు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సీట్ల విషయంలో అదే టార్గెట్ ఎమ్మెల్సీగా ఎన్నికై… తాజాగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలిసింది. ఆయన జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీకృష్ణ శ్రీనివాస్ గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని ఆశించారు. అయితే జగన్ ఆ పదవి ఇవ్వకుండా వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీని చేశారు సామాజిక సమీకరణాల నేపథ్యంలో మేయర్ పదవిని హరికుమారికి ఇచ్చారు. అప్పటి నుంచే కొంత అసంతృప్తితో ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గత ఏడాది స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయినా ఎమ్మెల్సీ పదవి కాదనుకుని ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. తన వర్గం కార్పొరేటర్లతో… ఆయనతో పాటు తన వర్గం కార్పొరేటర్లతో పార్టీ మారేందుకు అంతా ిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. విశాఖ జిల్లాలో జనసేన, టీడీపీకి బలం ఎక్కువగా ఉండటం, తాను అనుకున్న పదవి దక్కకపోవడంతోనే వైసీపీకి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్యాకప్ చెబుతున్నట్లు అర్థమవుతుంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. జనసేన నుంచి అయితే సులువుగా గెలిచే అవకాశాలున్నాయని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారని సమాచారం. రేపు పవన్ కల్యాణ్ కాకినాడ వస్తున్న సందర్భంగా ఆయనను కలిసేందుకు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు ఇప్పటికే తన అనుచరులకు సమాచారం ఇచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ అందుకు అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా ఆయన మాత్రం దానిని ఖండించకపోవడంతో వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కల్యాణ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించడంతోనే ఆయన జనసేనలో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా దానిని కాదనుకుని పార్టీ మారడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మేయర్ పదవి దక్కనంత మాత్రాన పదవులు ఇచ్చిన పార్టీని కాదని ఎన్నికల సమయంలో వెళ్లిపోవడం సరికాదన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. మరి ఆయన వెంట ఎవరెవరు వెళ్లనున్నారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ విశాఖ వైసీపీలో ఇది కుదుపుగానే భావించాలి.