Increased income in Tirumala తిరుమలలో పెరిగిన ఆదాయం

సిరా న్యూస్,తిరుమల;
తిరుమలలో కొలువైన వేంకటేశ్వరుడి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఏడుకొండల వాడిని దర్శించుకుని తరలించిపోతుంటారు. సాధారణ రోజుల్లోనే రద్దీ ఎక్కువగా ఉండే తిరుమలలో… ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ఇంకా పెద్దసంఖ్యలో తరలివస్తారు భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీపడతారు. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. దీంతో… ఉత్తర ద్వార దర్శనం నుంచి తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు భక్తులు. ఈనెల 23 నుంచి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు…. జనవరి 1 వరకు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు 67వేల 909 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా… వైకుంఠ ద్వాదశి నాడు 63,519 మంది దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు టీటీటీ హుండీ ఆదాయం 2.5 కోట్లు రాగా… వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) నాడు రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు వచ్చింది. అంటే… వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తిరుమల హుండీ ఆదాయం 7.55 కోట్లు వచ్చింది.జనవరి 2, 2023న తిరుమల తిరుపతి దేవస్థానంలో రికార్డు స్థాయిలో 7.68 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. ఆ తర్వాత… వైకుంఠ ద్వాదశి నాడు(ఆదివారం) మాత్రమే శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఒక్క రోజే రూ.5.05 కోట్లు వసూలు అయ్యింది. చాలారోజుల తర్వాత రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయ కూడా భారీగా పెరిగింది. ఇక… ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే… వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమలలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీంతో… జనవరి 1వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు… తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడసేవ నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవం నిర్వహిస్తున్నందున పౌర్ణమి గరుడసేవ ఉండదని టీటీడీ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *