సిరా న్యూస్;
-నేడు ఆయన జయంతి
( పెండ్యాల రామ్ కుమార్, మంథని )
నేరెళ్ళ వేణుమాధవ్ తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు.వరంగల్ పట్టణం లోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు. వీరికి ధ్వన్యనుకరణ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. మొదట్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం నిర్మించారు.పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ 2018, జూన్ 19వ తేదీ మంగళవారం నాడు తన 85వ యేట కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని స్వగృహంలో ఉదయం తుదిశ్వాస విడిచారు.