సిరా న్యూస్,హైదరాబాద్;
పీసీసీ చీఫ్ అంటే.. పార్టీకే పరిమితం. కార్యకర్తలు, నేతల సమావేశం..పేరుకే అధ్యక్షుడు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యాక..పదవిని బాధ్యతగా ఫీల్ అవుతున్నారట. ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకోకుండా..పార్టీలో సీనియర్లను నొప్పించకుండా వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారట.పీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ చేసిన ఒక ప్రయత్నం.. ప్రతి వారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చేలా చేసింది. సామాన్య కార్యకర్తలు, కిందిస్థాయి నేతలు మంత్రులను కలవడానికి చాలా ఇబ్బంది పడేవారు. గాంధీభవన్‌కు మంత్రులు వస్తుండటంతో నేరుగా వారిని కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్‌కు ప్రభుత్వం దగ్గరైందన్న ఫీలింగ్ కలుగుతుందంటున్నారు హస్తం నేతలు.పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చొరవతో చాలామంది గాంధీభవన్ మెట్లెక్కి సమస్యలు చెప్పుకుంటున్నారు. పార్టీ ఆఫీస్‌కు వచ్చేవారి విషయంలో కూడా మహేశ్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ.. పరిష్కార మార్గం చూపిస్తున్నారు. జీవో 317తో ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల అంశం విషయంలో పీసీసీ చీఫ్ చొరవ తీసుకొని మంత్రులను గాంధీభవన్‌కు పిలిచి చర్చలు జరిపేలా చేశారు.అక్టోబర్ 2న జీవో 317కు సంబంధించిన బాధిత ఉద్యోగులు గాంధీభవన్ ముట్టడికి వచ్చారు. కానీ వారిని లోపలికి పిలిచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో చర్చలు జరిపించారు. ఉద్యోగుల ఇబ్బందులను కచ్చితంగా పరిష్కారం చూపుతామని సర్దిచెప్పారు.లేటెస్ట్‌గా జీవో 29 విషయంలో గ్రూప్-1 అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. కొందరు అభ్యర్థులు గాంధీభవన్ ముట్టడికి వస్తే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జోక్యం చేసుకొని వారిని వదలిపెట్టాలని పోలీసులకు సూచించడమే కాకుండా.. గాంధీభవన్‌కు పిలిచి గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలు విన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి..మంత్రులను స్వయంగా కలిసి జీవో 29పై చర్చలు జరిపారు. ఒక బీసీ బిడ్డగా రిజర్వేషన్ల విషయంలో నష్టం జరిగితే ఊరుకోనని.. ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు.ఏ సమస్య వచ్చినా తన భుజాన వేసుకొని పరిష్కారం చూపుతున్నారు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్. ప్రతిపక్షాల విమర్శలను కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా, మూసీ వంటి విషయంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అండగా ఉంటూ విపక్షాలను ఎండగడుతున్నారు. పైగా ప్రభుత్వానికి..పార్టీకి మధ్య అనుసంధాన కర్తగా వ్యహరిస్తూ..అన్ని తానై పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు